అవతార్ ఫ్రాంచైజీలో కొత్త సంచలనాలు: ఫైర్ అండ్ యాష్ లో అంతకుమించి..

Avatar Franchise A Never Ending Sensation With Sequels Galore

ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఓ అపూర్వ సంచలనం. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అద్భుతం పండోరా అనే కల్పిత గ్రహాన్ని ఆధారంగా చేసుకుని, ప్రకృతిని కళ్లకు కట్టే విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించబడింది. 2009లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలై, అప్పటి వరకు ఉన్న టైటానిక్ రికార్డులను చెరిపేసింది. ప్రపంచ చలనచిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

అవతార్: ది వే ఆఫ్ వాటర్
ప్రథమ అవతార్‌ చిత్రానికి వచ్చిన విశేష స్పందనతో, జేమ్స్ కామెరూన్ ఆ తర్వాత “అవతార్‌: ది వే ఆఫ్ వాటర్”ను విడుదల చేశారు. ఈ సీక్వెల్ కూడా 160 భాషల్లో విడుదలై, అద్భుతమైన అండర్ వాటర్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, మూడో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది.

అవతార్-3: ఫైర్ అండ్ యాష్
‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం విడుదల కానున్నట్లు ఇప్పటికే జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. ఈ భాగానికి “అవతార్: ఫైర్ అండ్ యాష్” అని పేరుపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టామని, మంచి కథతో పాటు భారీ విజువల్స్‌ను అందిస్తున్నామని కామెరూన్ చెప్పారు.

“మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్ ని మూడో భాగంలో చూస్తారు. కొత్త ప్రపంచంతో పాటు విభిన్నమైన కథ, పాత్రలు కనిపిస్తాయి. అవతార్: ది వే ఆఫ్ వాటర్లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ పాత్రను మరింత అభివృద్ధి చేసాం. ఆమె కోసం చాలా శ్రమిస్తున్నాం,” అని కామెరూన్ పేర్కొన్నారు.

అవతార్-4, 5
‘అవతార్-4’ 2029లో, ‘అవతార్-5’ 2031 డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సీక్వెల్స్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.