టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నిర్మాతగా నిలిచిన దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సోదాలపై దిల్ రాజు తొలిసారి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన వివిధ అంశాలపై స్పష్టత ఇచ్చారు.
ఐటీ రైడ్స్ సాధారణ ప్రక్రియ
‘‘వ్యాపారాలు చేస్తుంటే ఐటీ సోదాలు జరగడం సాధారణమే’’ అని ఆయన అన్నారు. ‘‘ఈ సోదాలు కేవలం నా పై మాత్రమే జరగలేదని, వ్యాపార ప్రముఖులకూ జరిగాయి’’ అని వివరించారు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తనపై సోదాలు జరగడం విశేషమని తెలిపారు.
అసత్య ప్రచారాలపై
‘‘సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్ భారీగా డబ్బు, డాక్యుమెంట్లు దొరికాయని తప్పుడు వార్తలు ప్రచారం చేశాయి. కానీ మా ఇంట్లో రూ.20 లక్షల నగదు మాత్రమే లభించింది’’ అని స్పష్టం చేశారు. తన సంస్థలు పారదర్శకతతో పనిచేస్తున్నాయని, ఐటీ అధికారులు తన నివేదికలను పరిశీలించి ఆశ్చర్యపోయారని తెలిపారు. ఐటీ సోదాల సమయంలో తల్లికి గుండెపోటు వచ్చిందని పుకార్లు రావడం బాధ కలిగించింది. ఆమె వయసు 81 ఏళ్లు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురై చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె కోలుకొని ఇంటికి చేరారు అని వివరించారు.
సినిమా కలెక్షన్లపై
‘‘సినిమా కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం పరిశ్రమలో ఒక సమస్య. ఈ విషయంపై అందరూ కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. అది తప్పు, తీరు మార్చుకోవాలి’’ అని దిల్ రాజు పేర్కొన్నారు. ‘‘ఐటీ అధికారులు మా ఆఫీసులు, నివాసాల్లో వివరాలను సేకరించారు. 24 క్రాఫ్ట్స్‌లో లావాదేవీల వివరాలు అడిగి పరిశీలించారు. మా అకౌంట్స్ క్లియర్‌గా ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఫిబ్రవరి 3న మా ఆడిటర్స్ అధికారులను కలవనున్నారు’’ అని తెలిపారు.
ఆన్‌లైన్ లావాదేవీలు
‘‘90% టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయి. బ్లాక్ మనీకి అవకాశం తగ్గిపోయింది. ఇండస్ట్రీ అంతా ఆన్‌లైన్ లావాదేవీల వైపుకే వెళ్తోంది’’ అని దిల్ రాజు వివరించారు. ఈ ఐటీ సోదాలు రొటీన్ ప్రక్రియ మాత్రమేనని, పుకార్లు ప్రచారం చేయడం ఆపాలని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.