టికెట్ల పెంపు , బెనిఫిట్ షోలపై తెలుగు రాష్ట్రాలలో మరోసారి చర్చ మొదలైంది. సంధ్య థియేటర్ ఘటన చోటు చేసుకోవడంతో.. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులను ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ విషయంలో మరో ఆలోచనే లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఆ తరువాత సినీ ప్రముఖలతో భేటీ జరిగినా కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని వార్తలు వినిపించాయి.
ఇటు టికెట్లు పెంపు, బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఇలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు, టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్, బాలయ్య ..డాకూ మహారాజ్ సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చిన ఏపీ గవర్నమెంట్.. టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా ఓకే చెప్పింది.
టికెట్ ధరలపై పెంపుపై గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందని చెప్పిన పవన్… టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని, ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తోందని క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు.
మరోవైపు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును సీపీఐ నాయకుడు రామకృష్ణ తప్పుబట్టారు. తెలంగాణలో టికెట్ రేట్లను పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిర్మాతలు, సినీ హీరోలకు అనుకూలంగా ఇలా నిర్ణయం తీసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు.
దీంతో తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీ కూడా వ్యవహరించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాటలతో దీనిపై ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చినట్టేనని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా.. బెనిఫిట్ షోల వ్యవహారం ఏపీ, తెలంగాణలో కొత్త చర్చకు దారి తీస్తోంది.