మంచు విష్ణు ‘కన్నప్ప’: ప్రభాస్ ఇంట్రో సాంగ్‌తో భారీ అంచనాలు

Manchu Vishnus Kannappa Prabhas Intro Song And Star Studded Cast Build Anticipation

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, సప్తగిరి, ఐశ్వర్య రాజేష్, శివరాజ్ కుమార్ వంటి ప్రముఖ నటులతో ఈ సినిమా రూపొందుతోంది. మరోవైపు, ప్రభాస్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటంతో డార్లింగ్ అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది.

ఇప్పటికే ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఆ పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. అక్షయ్ లుక్‌ను ఇప్పటికే విడుదల చేయగా, ప్రభాస్ పాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ నందీశ్వరుడి (బసవయ్య) పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో ప్రభాస్ 20-30 నిమిషాల నిడివి కలిగిన స్క్రీన్ టైమ్‌లో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్‌కు ప్రత్యేకమైన ఇంట్రో సాంగ్ ఉంటుందని, దాన్ని గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారని హైపర్ ఆది వెల్లడించారు. ఈ సాంగ్‌లో ప్రభాస్ చాలా డివోషనల్‌గా కనిపించనున్నట్లు సమాచారం. మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ‘కన్నప్ప’లో స్టీఫెన్ దేవస్సే మరియు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని న్యూజిలాండ్‌లో ప్రధానంగా చిత్రీకరించారు. మోహన్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.