సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు అయిన కిరణ్‌రావు రూపొందించిన ‘లాపతా లేడీస్’ చిత్రం ఈ సంవత్సరం మార్చిలో థియేటర్లలో విడుదలై కామన్ ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా పొంది సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది.
సెంటిమెంటుకు, కామెడీని జత చేసి సమాజంలో మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలను లేవనెత్తిన ఈ చిన్ని చిత్రం ఈ సంవత్సరం ఎక్కువగా చర్చించబడిన మూవీలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీని చూసి చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఫీల్ గుడ్ మూవీని ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి పంపిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ప్రేక్షకుల , అభిమానుల కల నెరవేరింది.
ఈ సంవత్సరం ఆస్కార్‌కి ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ ఫిలింగా ‘లాపతా లేడీస్’ నిలిచింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ 29 చిత్రాల జాబితా నుంచి ‘లాపతా లేడీస్’ని ఆస్కార్ 2025కి అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. కమిటీ ముందు సమర్పించిన 29 మూవీల లిస్టులో ‘యానిమల్’, ‘ఆట్టం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. గత ఏడాది టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రదర్శించగా..అక్కడ అద్భుతమైన ప్రశంసలను అందుకుంది.
కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 2024లో పరిమితమైన స్క్రీన్‌లలో విడుదలైన ఈ మూవీ.. ఓటీటీలో వచ్చాక ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గరైంది. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో నటించిన నటులు నటులు నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ , రవి కిషన్ కూడా చాలా ప్రశంసలు అందుకున్నారు.
మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశంపై..అంత అద్భుతమైన చిత్రాన్ని రూపొందించినందుకు కిరణ్ రావు దర్శకత్వం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’కి ఆయన మాజీ భార్య, డైరక్టర్ కిరణ్‌రావు సహ నిర్మాతగా ఉన్నారు. ఇది అమీర్ నిర్మాణంలో రూపొందిన నాలుగో సినిమా కాగా.. ఇప్పుడు ఇది భారతదేశం నుంచి అధికారిక ఆస్కార్ ఎంట్రీని పొందడం విశేషం. అమీర్ ఖాన్ నిర్మాణంలో 2001లో విడుదలైన ‘లగాన్’ తొలి చిత్రం, దాన్ని కూడా ఆస్కార్‌కు పంపారు. తరువాత అమీర్ నిర్మాణంలో ‘తారే జమీన్ పర్’ – ‘పీప్లీ లైవ్’ కూడా ఆస్కార్ కోసం పంపబడ్డాయి.
అయితే ‘లగాన్’ సినిమా ఆస్కార్‌కి ఎంపికై విజయం సాధించగా, అమీర్ నిర్మించిన మరో రెండు సినిమాలు షార్ట్‌లిస్ట్‌లోకి రాలేకపోయాయి. అయితే ఇప్పుడు నాలుగో సారి, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ అవకాశాన్ని పొందింది. ఈ మూవీ భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఆస్కార్ రేసులో చేరడంతో.. ‘లాపతా లేడీస్’ ప్రయాణం ఆస్కార్‌లో ఎంతవరకు చేరుకుంటుందనే దానిపైన ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.