అల్లు అర్జున్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని..దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని రకరకాల వాదనలు వినిపించాయి. కానీ అల్లు అర్జున్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల వాదిస్తున్నారు.
డిసెంబర్ 4వ తేదీ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకుని., రేవతి అనే ఒక వివాహిత కన్నుమూసింది. ఆమె కుమారుడు ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు. రేవతి మృతిపై పుష్ప 2 టీమ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి.. నష్టపరిహారంగా రూ. 25 లక్షలు ప్రకటించి బాలుడు వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చింది.
అయితే మహిళ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో డిసెంబర్ 13న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగా… నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మధ్యంతర బెయిల్ కొరకు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడంతో..కోర్టు బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చినా కూడా ఒక రాత్రంతా చంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీలానే గడపాల్సి వచ్చింది. మర్నాడు అల్లు అర్జున్ అరెస్ట్ అవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టాలనే శుక్రవారం అరెస్ట్ చేశారని కథనాలు వినిపించాయి. శని, ఆదివారం కోర్టుకు సెలవు దినాలు కావడంతో అల్లు అర్జున్ ని ఎలాగైనా జైలులో ఉంచాలనే ప్రణాళిక పన్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
హైకోర్టులో అల్లు అర్జున్ తరపున వాదించిన నిరంజన్ రెడ్డి కూడా.. అరెస్ట్ సరికాదని అన్నారు. అల్లు అర్జున్ ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే సరిపోతుందని వాదించారు. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన రాయన్ మూవీ రిలీజ్ సమయంలో ఒక అభిమాని థియేటర్ వద్ద మృతి చెందాడు. అప్పుడు షారుఖ్ ఖాన్ ని ఎవరూ బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని జడ్జికి గుర్తు చేశారు.
కానీ పోలీసుల వివరణ ప్రకారం అల్లు అర్జున్ తప్పు చేశాడనే తెలుస్తోంది. పుష్ప 2 మూవీ హీరో, హీరోయిన్, దర్శక నిర్మాతలు ఎవరూ కూడా థియేటర్ వద్దకు రావడానికి వీలు లేదని.. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని తాము సంధ్య థియేటర్ యాజమాన్యానికి లేఖ ద్వారా తెలియజేశామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల సూచనలు అల్లు అర్జున్ పట్టించుకోలేదని.. వద్దని చెప్పినా కారులో ర్యాలీగా సంధ్య థియేటర్ కి వచ్చాడని. అందుకే ప్రమాదం జరిగిందని అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి, రిమాండ్ కి పంపడానికి కారణం ఇదే అంటూ.. దీనికి సంబంధించిన ఒక నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.