బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ భద్రత విషయలో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్ ఖాన్ కు ఉన్న వివాదాలకు ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ మొత్తాన్ని సల్మాన్ చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా హత్య చేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమతమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నారు ముంబాయి పోలీసులు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే సల్మాన్‌కు ఇలా బెదిరింపులు రావడం మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్దకు ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం విదితమే. అలాగే అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు యత్నించడం అప్పట్లో కలకలం సృష్టించింది. బాలీవుడ్ నటుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గత ఏడాది ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది.
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాబా హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను కూడా పెంచారు. ఖాన్ కుటుంబం కూడా ఎవరిని ఇంటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి పరిస్థితిలో సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు రావడంతో నటుడి అభిమానులలో ఆందోళనను పెంచుతోంది. ఇటీవలే ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గం నాయకుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ ముంబైలో హత్యకు గురికావడం గమనార్హం. దీనికి బాధ్యత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తీసుకుంది. అదే సమయంలో ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కు కూడా బెదిరింపు వచ్చింది. బెదిరింపు పంపిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సన్నిహితంగా ఉంటాడని సమాచారం. దీని తర్వాత సల్మాన్ విషయంలో మళ్లీ టెన్షన్ పెరిగింది. నటుడి అభిమానులు, ప్రియమైనవారు అతని గురించి ఆందోళన చెందుతున్నారు.