మరో కోవిడ్ వ్యాప్తికి భారత్ సిద్ధంగా ఉండాలంటూ.. యూఎస్ సెండటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిపుణులు తాజాగా హెచ్చరించారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం.. యూఎస్‌లో దేశంలోని ఇరవై ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. దక్షిణ కొరియాలో కూడా గణనీయంగా ఈ కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాలు చెబుతున్నదాని ప్రకారం.. జూన్ 24 నుంచి జూలై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీ వారం సగటున 17,358 కోవిడ్ నమూనాలను పరీక్షించారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం భారత్‌లో కూడా 908 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నుంచి జూలై మధ్య రెండు మరణాలు కూడా సంభవించినట్లు తేలింది.
ఇతర దేశాల మాదిరిగానే భారత్‌లో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినప్పటికి కూడా భారతీయులు దీనికి సిద్ధంగా ఉండాలని నోయిడాలోని శివ్ నాడార్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ దీపక్ సెహగల్ చెప్పారు. వైరస్ కచ్చితంగా తిరిగి పుంజుకుందని, ఈ సారి కోవిడ్ వైరస్ సంభవించిన వారిలో 26 శాతం మరణాలు, 11 శాతం పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్ఓ తమ నివేదికలో పేర్కొందని..ఇది ఆందోళనకరమైన విషయమని దీపక్ అన్నారు.
ఇటీవల వ్యాప్తిలో కేపీ వేరియంట్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఇది ఓమిక్రాన్ వంశానికి చెందింది. ఓమిక్రాన్ కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే లక్షణం ఉంది. జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ జేఎన్.1 నుంచి కేపీ.2 వేరియంట్ పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. భారతదేశంలో కేపీ.2 మొదటిసారిగా డిసెంబర్ 2023లోనే ఒడిశాలో కనుగొన్నట్లు నివేదికలో ఉంది.
కేపీ.2 జాతి ఓమిక్రాన్ వేరియంట్ నుంచి స్పైక్ రీజియన్‌లో మూడు మ్యూటెషన్లను కలిగి ఉంది. INSACOG (ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) నుంచి వచ్చిన డేటా, ఈ వేరియంట్ ఇప్పటికే భారతదేశంలో ఉందని చూపింది. కేపీ.ఎక్స్ – ఇందులో కేపీ.3.1.1 మరియు FLiRT వేరియంట్ లేదా కేపీ.2 వంటి దానికి సంబంధించి జాతులు ఉన్నాయి.
భారతదేశంలోని మొత్తం కోవిడ్ సీక్వెన్స్ శాంపిల్స్‌లో జూలై చివరి వారంలో సేకరించిన వాటిలో దాదాపు 39 శాతం ఇవి ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ డాష్ బోర్డులో భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలను చూపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం దేశంలో 279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జెన్.1 ఓమిక్రాన్ నుంచి ఉద్భవించిన కేపీ.1 మరియు కేపీ.2 జాతులు భారతదేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.