అమెరికాలో వచ్చే నెలలో కొలువుదీరనున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. అక్రమ వలసదారులపై దృష్టి సారించింది. తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారి చిట్టాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో 14.45 లక్షల మంది ఉండగా.. వీరిలో భారతీయుల సంఖ్య 17,940గా ఉందని తేలింది. వీరందరినీ భారత్‌కు తిప్పి పంపే ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ వెల్లడించింది.
ఇక ట్రంప్ కూడా ఇటీవల టైమ్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ….అమెరికాలోకి అక్రమంగా చొరబాట్లు జరిగాయని….. ఇది అమెరికాపై దురాక్రమణగా భావిస్తామని చెప్పారు. పలు దేశాలు ఈ విషయంలో తమకు సహకరించడం లేదన్నారు. తాము గుర్తించిన వ్యక్తుల పౌరసత్వం వివరాలు అడిగామని…. కానీ స్పందన లేదని చెప్పారు. అలాంటి 15 దేశాలను తమకు సహకరించడం లేదనే జాబితాలో పెట్టామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
ఒకవేళ కనుక ఆ దేశాలు అమెరికాకు సహకరించకపోతే.. నేషనల్ గార్డ్స్ సాయంతో వారిని తిప్పి పంపుతామని ట్రంప్ చెప్పారు. మరోవైపు భారత్ కూడా బహిష్కరణ కోసం 18 వేల మంది వివరాలు అడిగితే.. ఇవ్వడం లేదని ఐసీఈ తెలిపింది. అమెరికాలో తప్పుడు పత్రాలతో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారున్నట్లు వివరించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ …వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ట్రంప్ పేరు వింటేనే అమెరికాలోని అక్రమ వలసదారుల వెన్నులో వణుకు పుడుతోంది. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను తీసుకొస్తానని, అక్రమంగా దేశంలోని వచ్చిన వారిని తరిమేస్తానని ఎన్నికల ప్రచార సమయంలోనూ, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ట్రంప్ చెప్పారు.
ఆయన చెప్పినట్లుగానే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందు నుంచే తన కార్యాచరణను ట్రంప్ మొదలు పెట్టారు.అయితే 208 దేశాలకు చెందిన అక్రమ వలసదారులు అమెరికాలో డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటుండగా.. అందులో భారత్ 13వ స్థానంలో ఉందట. అయితే, గత మూడు సంవత్సరాల్లో అక్రమ మార్గాల్లో అగ్రరాజ్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిలో సగటున 90వేల మంది భారతీయులు పట్టుబడినట్లు ఐసీఈ నివేదికలు చెబుతున్నాయి.