దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిర్వహించేందుకు, ప్రభుత్వ అప్పులను తగ్గించి, ఖర్చులను సమర్థంగా నియంత్రించేందుకు ఆర్థిక ఏకీకరణ (Fiscal Consolidation) 2025 భారత బడ్జెట్‌లో ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. కోవిడ్-19 సమయంలో, ప్రభుత్వ ఖర్చులు పెరిగి, దేశ జాతీయ ఆదాయంతో పోల్చితే అప్పుల భారం 9.5% స్థాయికి చేరుకుంది. అయితే, క్రమంగా ఆర్థిక సమతుల్యతను కాపాడేందుకు ముందడుగు వేసిన ప్రభుత్వం, ప్రస్తుతం ఈ రుణభారాన్ని 4.8% స్థాయికి తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని 4.4% కు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
గతంలో అప్పుల నిర్వహణ విధానం
30 సంవత్సరాల క్రితం, ప్రభుత్వ ఖర్చులను భర్తీ చేయడానికి నేరుగా నోట్లను ముద్రించే విధానం అనుసరించబడేది. దీని వల్ల మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగేది.. అదే స్థాయిలో వస్తువుల ఉత్పత్తి పెరగకపోవడం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయేవి. ఈ ద్రవ్యోల్బణ భారం ప్రధానంగా పేద ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపేది, అయితే సంపన్నుల జీవితాల్లో పెద్దగా మార్పు ఉండేది కాదు.
కానీ, గత 30 సంవత్సరాలుగా, నోట్ల ముద్రణను తగ్గించి, ప్రభుత్వ ఖర్చులను అప్పులతో భర్తీ చేయడం అనేది సాధారణంగా మారింది. దీనివల్ల, ప్రభుత్వ అప్పులను తగిన విధంగా లెక్కించి, వడ్డీలు చెల్లించి, భవిష్యత్ తరాలపై అధిక భారం పడకుండా నియంత్రించేందుకు అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవడం శుభసూచకం.
ప్రస్తుత కేంద్ర నిర్వహిస్తున్న ఆర్థిక వ్యూహం
అప్పులు తీసుకోవడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అనివార్యమవుతుంది. ఎంత అప్పు తీసుకున్నారో, ఎంత వడ్డీ చెల్లించాల్సుందో ఖచ్చితంగా లెక్కించాల్సి వస్తుంది. దీని ఫలితంగా, భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించేలా, భవిష్యత్ తరాలకు అప్పుల భారం పడకుండా బడ్జెట్ రూపొందించబడుతోంది. 2025 బడ్జెట్ ద్వారా ఆర్థిక నిర్వహణ మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక ఏకీకరణ ద్వారా, ప్రభుత్వ అప్పులను తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, భవిష్యత్‌లో భారత ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరంగా మార్చే చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యంగా మారింది. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రగతిశీలంగా, స్థిరంగా అభివృద్ధి చెందేలా మారేందుకు అవసరమైన మార్గదర్శకాలు అమలు చేయబడుతున్నాయి. ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే, భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశముంది.