భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలలో మహా కుంభమేళా ఒకటి. హిందూ ధర్మంలో నాలుగు ప్రధాన పుణ్య ప్రాంతాలలో మాత్రమే ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి ఈ మహా కుంభమేళాను గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో జరుపుతారు.అలా ఈ ఏడాది ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో 45 కోట్ల మంది పుణ్యస్నానమాచరిస్తారని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తుంది.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతున్న మహా కుంభమేళాలో ఆరు రాజ స్నానాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మొదటి స్నానం జనవరి 13న పౌష పూర్ణిమ రోజు, చివరి స్నానం ఫిబ్రవరి 26న శివరాత్రి రోజు జరుగుతుంది. ఈ మధ్యలో జనవరి 14న మకర సంక్రాంతి స్నానం, జనవరి 29న మౌని అమావాస్య స్నానం, ఫిబ్రవరి 3న వసంత పంచమి స్నానం, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రాచరిక స్నానం ఉంటాయి.
అలా 44 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాలో విశేషమైన పర్వదినాలతో కలిపి మొత్తంగా 45 కోట్ల మంది స్నానం చేస్తారని కేంద్రం అంచనా వేస్తుంది. భారతదేశ జనాభా 140 కోట్లు పైనే కాబట్టి..వీరిలో 45 కోట్లు అంటే.. మొత్తం జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు స్నానాలు ఆచరిస్తారని భావిస్తోంది. మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది స్నానం చేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మౌని అమావాస్య రోజు అంటే జనవరి 29 వతేదీన 10 కోట్ల మంది స్నానం చేస్తారని చెబుతున్నారు. అలా ఈ 44 రోజుల్లో ఫిబ్రవరి 26 నాటికి 45 కోట్ల మంది స్నానం చేస్తారని వారు అంచనా వేస్తున్నారు. కాగా..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనల వల్ల ఈసారి కుంభమేళాలో పుణ్య స్నానానికి బాగా క్రేజ్ పెరిగింది. ఎటువంటి ప్రచారం లేకుండానే ప్రజలు తండోపతండాలుగా కుంభమేళాకు వస్తున్నారు.