తన 6 ఏళ్ల కుమారుడి చేతులు, కాళ్లు కట్టేసి అతనిపైకి అత్యంత భయంకరమైన పిట్ బుల్ కుక్కను వదిలింది అమెరికాలోని ఓ జాలి లేని తల్లి. బాలుడిపై దాడి చేసిన కుక్క అతనిని తీవ్రంగా గాయపరిచింది. బాలుడి మెడ మరియు చెవులతో పాటు శరీరంలోని చాలా భాగాలను కొరకడంతో ఎక్కువగా రక్తస్త్రావం అయింది. అయితే బాలుడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనలో ప్రాణాపాయం నుంచి ఆ బాలుడు గట్టెక్కాడు. బాలుడిపై దాడి చేసిన కుక్కను స్థానికులు తరిమి కొట్టి అతని చేతులు, కాళ్ల నుంచి బేడీలను తీసివేశారు. రక్తస్రావంతో ఉన్న బాలుడికి ప్రథమ చికిత్స అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకోవడంతో అంబులెన్స్ మరియు అత్యవసర వైద్య సిబ్బందిని పిలిచారు. వెంటనే బాలుడిని హెలికాప్టర్‌లో తరలించి ఆస్పత్రిలో చేర్చారు.
అమెరికాలోని ఒహియో లోని సవన్నా లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. బాలుడి తండ్రికి దూరమైన ఆ మహిళ మరో ప్రియుడితో స్నేహం చేస్తోందట. ఈ తరుణంలో ఆమె తన కుమారుడిపై చిరాకు చూపుతోందని, చిన్న తప్పిదానికి కూడా కఠినంగా శిక్షిస్తూ నిత్యం హింసిస్తోందట. బాలుడికి కఠిన శిక్ష విధించడంలో అతని తల్లి మాత్రమే కాకుండా చాలా మంది కుటుంబ సభ్యులు సహకరించినట్లు తెలుస్తోంది. బాలుడి తల్లి ఏంజెలీనా విలియమ్స్ మరియు ఆమె బంధువు రాబర్ట్ మిచాల్స్కీ ఈ చర్యకు సహకరించారు. రాబర్ట్ మిచల్స్కీ ఇంట్లోనే ఈ దారుణం జరిగిందని పిట్ బుల్ కుక్క యజమాని కూడా అతడే అని పోలీసులు తెలిపారు.
అలాగే, ఈ సంఘటన జరిగినప్పుడు, ఏంజెలీనా విలియమ్స్ ప్రియుడు టేలర్ డిజైరీ మార్విన్ బ్రౌన్ కూడా అదే ఇంట్లో ఉన్నాడట. బాలుడిని కఠినంగా శిక్షించేలా ఏంజెలీనాను ప్రోత్సహించడంతో పాటు అతడు కూడా సహకరించాడట. ఈ నేపథ్యంలో బాలుడి తల్లి ఏంజెలీనా విలియమ్స్‌తో పాటు ఆమె బంధువు రాబర్ట్ మిచాల్స్కీ, ఏంజెలీనా ప్రియుడు టేలర్ డిసైరీ మార్విన్ బ్రౌన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి మరియు ఆమె బంధువు మాత్రమే కాకుండా, జంతు సంరక్షణ కేంద్రానికి పంపబడిన పిట్ బుల్ కుక్కను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.