తీవ్ర రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్ లో శాంతిని నెలకొల్పేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది. ఈ తరుణంలో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం స్థాపించబడింది. దీంతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మెల్లగా అదుపులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో తన ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా సోమవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయడంతో కొత్తగా ఎన్నికలకు మార్గం సుగమమైంది. అప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనివార్యమవడంతో…దీనికి నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. బంగ్లాదేశ్ లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్న మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిగా నియమించారు. ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, విద్యార్ధుల ఉద్యమానికి కీలకంగా వ్యవహరించిన సమన్వయకర్త నహిద్ ఇస్లాం, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించిన యూనస్‌తో ఇప్పటికే చర్చించినట్లు ప్రకటించారు.
యూనస్‌పై హసీనా ప్రభుత్వం 190కి పైగా కేసుల్లో అభియోగాలు మోపింది. అంతేకాదు.. గతంలో షేక్ హసీనా ప్రభుత్వంతో అనేక గొడవలు జరిగాయి. చట్టబద్ధమైన పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు దాటిందనే కారణంతో గ్రామీణ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అతనిని బలవంతంగా తొలగించారు. దేశంలో నిరసనలకు నాయకత్వం వహించిన విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని గతంలో డైలీ స్టార్ నివేదిక పేర్కొంది. 1940లో చిట్టగాంగ్‌లో జన్మించారు మహమ్మద్ యూనస్. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. అంతకుముందు ముందు ఢాకా విశ్వవిద్యాలయంలో కూడా విద్యనభ్యసించారు.
బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును స్వాగతించిన యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లెర్ స్పందించారు. షేక్ హసీనా రాజీనామా, ఆ తర్వాత దేశం నుంచి నిష్క్రమణపై బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఆందోళనలను విరమించుకోవాలని కోరారు. బంగ్లాదేశ్ ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు.. తాత్కాలిక ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు.