అయోధ్యలోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో, 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగించాలని నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ), మరియు జమైత్ ఉలేమా-ఎ-హింద్ సంస్థ నిర్ణయించుకున్నాయి. నవంబర్ 17, ఆదివారం నాడు లక్నోలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ప్రతిపాదనను సైతం అంగీకరించబోమని ఏఐఎంపీఎల్‌బీ స్పష్టం చేసింది.
జమైత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడం తమ హక్కు అని చెప్పారు. ముస్లిం వర్గాలు చేసిన వాదనలను, సమర్పించిన సాక్ష్యాధారాలను అంగీకరించిన సుప్రీంకోర్టు, తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడ హాజరయ్యారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఇక దీనిపై రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయబోమని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే తాజాగా సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించుకుంది.
[subscribe]



