భారత తొలి మహా దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్‌గా బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను దేశ తొలి మహా దళాధిపతిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి ఆయన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను నియమించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో త్రివిధ దళాల మధ్య అవగాహనా, త్వరితగతిన నిర్ణయాలు, తగిన సమన్వయం కోసం సీడీఎస్‌ను నియామకం దోహదపడుతుందని తెలిపారు.
సీడీఎస్‌కు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 65 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సైన్యం, నౌకాదళం, వాయుసేన అధిపతులలో ఎవరైనా సీడీఎస్‌గా నియమితులైతే 65 సంవత్సరాలవరకు ఆ పదవిలో కొనసాగేందుకు వీలుగా వాటి సర్వీసు నిబంధనలను ఇటీవల రక్షణ శాఖ సవరించింది.
మరోవైపు ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న బిపిన్ రావత్ నేడు పదవీ విరమణ చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఆయన నివాళులర్పించారు. ఆతర్వాత సౌత్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌గా చివరిసారిగా రావత్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భారత సైన్యాధిపతిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టెనెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఆయన అభినందనలు తెలియజేశారు. దేశ 28వ ఆర్మీ చీఫ్‌గా నరవణే బాధ్యతలు చేపట్టనున్నారు.
[subscribe]














































