ఆస్ట్రేలియా కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నాయకుడు ఆంటోని అల్బనీస్ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా 59 ఏళ్ల ఆంటోని మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పరిపాలనకు తెరపడింది. ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ తన ఓటమిని అంగీకరించారు. మొత్తం 151 స్థానాలకుగాను 72 స్థానాల్లో గెలుపొందింది. మారిసన్ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమితం కాగా, ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. మూడేళ్లకి ఒకసారి జరిగే ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ సంకీర్ణ కూటమి కంటే లేబర్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొనడంలో విజయం సాధించింది. 2007 తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా.. ఆస్ట్రేలియన్ ప్రజలు మార్పు కోసం ఓటు వేశారు. ఈ విజయంతో నేను మరింత బాధ్యతగా ఉంటాను, అని ఆంటోని అల్బనీస్ సిడ్నీలో తన మద్దతుదారులతో అన్నారు. ఆస్ట్రేలియన్లను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఆంటోని తెలిపారు. కాగా అల్బనీస్ మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుండి ఈ 26 సంవత్సరాలలో, లేబర్ పార్టీ కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంది. 2019 నుంచి ఆయన పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాగా, ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆంటోని ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇరుదేశాల ప్రయోజనాలపై కలిసికట్టుగా ముందుకు సాగుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ