ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ఆరోన్ ఫించ్ తెలిపాడు. గత ఏడాది సెప్టెంబర్ లో వన్డే క్రికెట్ నుంచి ఫించ్ తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీ20 క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పాడు. ఫించ్ ముందుగా 2011లో అడిలైడ్లో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.
ఫించ్ తన కెరీర్లో మొత్తం 5 టెస్ట్‌లు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడాడు. 146 వన్డేల్లో 5406 పరుగులు చేయగా, అందులో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 5 టెస్టుల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 278 పరుగులు, 103 టీ20ల్లో 2 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలలో కలిపి 3210 పరుగులు చేశాడు. టీ20 మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డ్ ఫించ్ (172) పేరుమీదనే ఉంది. అలాగే 2020లో వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2014, 2018లో టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఫించ్ ఎంపికయ్యాడు. 2015లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఫించ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా వన్డే జట్టుకు 2017-22 వరకు, ఆస్ట్రేలియా టీ20 జట్టుకు 2014-16, 2018-22వరకు కెప్టెన్ గా ఉన్నాడు.
రిటైర్మెంట్ పై ఫించ్ స్పందిస్తూ, “2024లో జరిగే తదుపరి టీ20 ప్రపంచ కప్ వరకు ఆడలేనని గ్రహించి, ఇప్పుడే సరైన తరుణంలో వైదొలిగి, ఆ ఈవెంట్‌ను ప్లాన్ చేయడానికి జట్టుకు సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎంతో ఇష్టపడే ఆటను అత్యున్నత స్థాయిలో ఆడేందుకు నన్ను అనుమతించినందుకు నా కుటుంబ సభ్యులకు, నా సహచరులు, క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా మరియు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. నా అంతర్జాతీయ కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. 2021లో తొలి టీ20 ప్రపంచకప్ విజయం మరియు 2015లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలవడం అనేవి నాకు రెండు మంచి జ్ఞాపకాలు. 12 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడం మరియు అన్ని కాలాలలో అత్యుత్తమ ఆటగాళ్లతో మరియు పోటీగా ఆడటం ఒక అద్భుతమైన గౌరవం” అని పేర్కొన్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE