బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30, బుధవారం నాడు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తుది తీర్పు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ముందుగా అనుకున్న పథకం ప్రకారం చేసింది కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న 49 నిర్దోషులేనని పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 2 వేల పేజీల జడ్జిమెంట్ కాపీని రూపొందించారు. అలాగే ఈ కేసు విచారణలో 351 మంది సాక్షులను సీబీఐ విచారించగా, ఆరోపణలు ఎదుర్కొన్న 49 మందిలో విచారణ జరుగుతున్న సమయంలోనే 17 మంది మరణించినట్టు పేర్కొన్నారు. 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటుచేసుకోగా, సుదీర్ఘ 28 సంవత్సరాలు అనంతరం తుది తీర్పు వెలువడింది.
ఈ కేసులో బీజేపీ కీలక నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ సహా పలువురు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటుండడంతో ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొన్న 32 మందిని తీర్పు ఇచ్చే సమయంలో కోర్టులో హాజరుకావాల్సి ఉండగా వయోభారం దృష్ట్యా ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మహంత్ నృత్య గోపాల్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు. ఉమా భారతి మరియు కళ్యాణ్ సింగ్‌లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతుండడంతో వారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇక సాక్షి మహారాజ్, పవన్ పాండే, లల్లూసింగ్, చంపత్‌రాయ్ సహా మిగిలిన వారంతా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు బాబ్రీ తీర్పు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు దృష్ట్యా అన్ని రాష్ట్రాలలోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu