ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ‘ఉమెన్ ఇన్ బ్లూ’ జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నజరానా ప్రకటించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన టీమ్‌ఇండియాకు రూ.51 కోట్ల భారీ నగదు బహుమతిని అందిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
మ్యాచ్ వివరాలు..
వేదిక: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్‌కు సుమారు 40 వేల మంది అభిమానులు హాజరయ్యారు.
సరికొత్త చరిత్ర: హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను స్వదేశంలో గెలుచుకుని భారత జట్టు సగర్వంగా ముద్దాడింది.
అవార్డుల పంట
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన షెఫాలీ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: టోర్నీలో మొత్తం 215 పరుగులు, 22 వికెట్లతో సత్తా చాటిన సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా ఎంపికైంది.
ప్రైజ్ మనీ వివరాలు..
విశ్వవిజేతగా నిలిచిన భారత్ సహా టోర్నీలో పాల్గొన్న జట్లకు ఐసీసీ అందించిన ప్రైజ్ మనీ వివరాలు ఇలా ఉన్నాయి..
డాలర్లలో ప్రైజ్ మనీ.. భారత కరెన్సీలో (సుమారు)
విశ్వవిజేత: భారత జట్టు – $4,480,000 (రూ.39.80 కోట్లు)
రన్నరప్: దక్షిణాఫ్రికా – $2,240,000 (రూ.19.90 కోట్లు)
సెమీఫైనల్స్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ – $1,120,000 చొప్పున (రూ.9.94 కోట్లు)
5, 6 స్థానాలు: శ్రీలంక, న్యూజిలాండ్ – $700,000 చొప్పున (రూ.6.21 కోట్లు)
7, 8 స్థానాలు: బంగ్లాదేశ్, పాకిస్థాన్ | $280,000 చొప్పున (రూ.2.48 కోట్లు)
గ్యారంటీ మనీ: ప్రపంచకప్‌లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద ఒక్కొక్క జట్టుకు $250,000 (సుమారు రూ2.22 కోట్లు) చొప్పున దక్కాయి.
లీగ్ విజయాలు: లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు $34,314 (సుమారు రూ30.47 లక్షలు) చొప్పున లభించాయి.

































