బెంగళూరులో ట్రాఫిక్ నియమాలను తుంగలో తొక్కుతూ, అడ్డదిడ్డంగా వాహనం నడుపుతూ ఒక వ్యక్తి ఏకంగా 311 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. అతని పేరు సుదీప్, బెంగళూరు నగరానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు. అతడు ట్రాఫిక్ సిగ్నల్స్, హెల్మెట్ ధరించడం, వన్ వే డ్రైవింగ్, అనుమతి లేని ప్రదేశాల్లో పార్కింగ్ వంటి ఎన్నో ట్రాఫిక్ రూల్స్‌ను లెక్క చేయకుండా బ్రేక్ చేసేవాడు. దీంతో అతడిపై 311 ట్రాఫిక్ కేసులు నమోదయ్యాయి. కానీ అతడు చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరిగేవాడు.
ట్రాఫిక్ పోలీసులు అతడిని పట్టుకోవడంపై పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా, ఈ కేసు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. శిబం అనే వ్యక్తి సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా సుదీప్ చేసిన ఉల్లంఘనల వివరాలను, అతడిపై నమోదైన జరిమానాల వివరాలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అలాంటి వ్యక్తిని ఇంకా ఎందుకు పట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు యాక్షన్‌లోకి వచ్చారు.
నెటిజన్ల ఒత్తిడితో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సుదీప్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఫిబ్రవరి 3న (సోమవారం) ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అతడు తన టూవీలర్‌పై వెళ్తుండగా, సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నమోదైన మొత్తం 311 ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.1,61,500 జరిమానా విధించారు. కానీ అతడికి అంత మొత్తం చెల్లించడానికి అవకాశం లేకపోవడంతో, ఎలాగోలా రూ.1,05,500 జరిమానా కట్టించారు. మిగతా రూ.50,000 బాకీ ఉండటంతో, అతడు నడుపుతున్న టూవీలర్‌ను పోలీసులు సీజ్ చేశారు.
సుదీప్ ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం పెరియ స్వామి అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు పెరియ స్వామికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఈ వాహనం వినియోగిస్తూ సుదీప్ చేసిన అన్ని ఉల్లంఘనల వివరాలను నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ ఘటన ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే ఎంతటి సమస్యలు ఎదురవుతాయో స్పష్టంగా తెలియజేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఎంతటి జరిమానా విధించబడుతుందో, చివరికి వాహనాన్ని సీజ్ చేసే వరకు వెళ్లొచ్చునని ఇది మరోసారి నిరూపించింది. 311 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన బెంగళూరు యువకుడు: సోషల్ మీడియా పోస్ట్‌తో పుట్టిన గోల!