కొవాగ్జిన్‌ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో అనుమతి

Bharat Biotech's Covaxin Covid-19 Vaccine Gets WHO Approval for Emergency Use Listing

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్‌” కోవిడ్ వ్యాక్సిన్ ను దేశంలో ఇప్పటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌-ఈయూఎల్‌) కొవాగ్జిన్‌ చేర్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. గత కొన్ని నెలలుగా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్‌వో అనుమతిపై చర్చ జరుగుతుండగా, కోవిడ్ నివారణ కోసం డబ్ల్యూహెచ్‌వో ద్వారా ధృవీకరించబడిన వ్యాక్సిన్‌ల జాబితాలోకి కొవాగ్జిన్‌ కూడా చేరినట్టు బుధవారం సాయంత్రం డబ్ల్యూహెచ్‌వో అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్‌ చేసింది.

డబ్ల్యూహెచ్‌వో ద్వారా సమావేశమైన మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంత్రణ నిపుణులతో రూపొందించబడిన టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కోవిడ్ నుండి రక్షణ కల్పించడంలో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించిందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ కోవిడ్ ప్రమాదాలను అధిగమించి ప్రయోజనాలను కలిగిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ ను ఉపయోగించవచ్చని చెప్పారు. అలాగే కోవాక్సిన్ వ్యాక్సిన్‌ని డబ్ల్యూహెచ్‌వో యొక్క స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆన్ ఇమ్యునైజేషన్ కూడా సమీక్షించిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ ని రెండు డోస్‌లలో మొత్తం నాలుగు వారాల విరామంతో, 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారందరికీ అందించవచ్చని సిఫార్సు చేసినట్టు తెలిపారు. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి లభించడంతో ఈ వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు విదేశీ పర్యటనల సమయంలో ఆంక్షలు, స్వీయ నిర్బంధం విషయంలో ఇకపై ఊరట లభించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ