బీహార్ ఎన్నికలు: ప్రతిపక్షాల సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌

Bihar Polls: Mahagathbandhan Declares Tejashwi Yadav Named Opposition's CM Face

బీహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరిచూపు ఈ రాష్ట్రంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ (Maha Gathbandhan) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చింది.

ఆర్జేడీ యువ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని భాగస్వామ్య పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి అధికారికంగా ప్రకటించింది.

సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులు ఖరారు:

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ, తేజస్వీ యాదవే తమ కూటమి సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముకేశ్ సహనీ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా, ఎన్డీయే కూటమికి నేరుగా సవాల్ విసిరిన మహాగఠ్‌బంధన్, “మా అభ్యర్థి తేజస్వీ యాదవ్. మరి మీ అభ్యర్థి ఎవరు?” అంటూ ప్రశ్నించింది.

పోస్టర్ వివాదం, కూటమిలో చీలిక వదంతులు:

అయితే, ఈ మీడియా సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఫోటో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై బీజేపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఇది సంయుక్త మీడియా సమావేశమా? కాంగ్రెస్, రాహుల్‌కు వారి స్థానమేంటో చూపించారా? అంటూ ప్రశ్నించింది.

కాగా, ఈ కూటమిలో కాంగ్రెస్ 61 స్థానాల్లో, ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేయగా, సీపీఐ 9, సీపీఐ (ఎం) 4 స్థానాల్లో బరిలోకి దిగాయి. కొన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొనడంతో, కూటమిలో చీలిక వచ్చిందనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ అంతర్గత పోటీపై సయోధ్య కుదురుతుందా లేదా అనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here