పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బలమైన ప్రతిపక్షంగా మారిన ఇండియా కూటమి పార్లమెంట్‌లో చెలరేగి పోతోంది. గతంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎత్తి చూపుతూ.. అధికార పక్షంపై విమర్శల బాణాలు వదులుతోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష ఎంపీలు ఎకధాటికా అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అధికారపక్షంపై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. నిరసనల మధ్యలోనే ప్రధాని ప్రసంగం కొనసాగింది.
ఈక్రమంలో పార్లమెంట్‌లో విపక్ష ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై అధికారపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. లోక్‌సభలో ప్రధాని మోడీ.. రాహుల్ గాంధీలు వ్యవహరించిన తీరును వివరిస్తూ రెండు వీడియోలను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నియంత ఎవరనేది ఆ వీడియోలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని రాసుకొచ్చింది. ‘మొదటి వీడియోలో రాహుల్ గాంధీ విపక్ష ఎంపీలతో.. సభలో నిబంధనలు ఉల్లఘించాలని, మోడీ ప్రసంగానికి ఆటంకం కలిగించాలని సూచించారు. రెండో వీడియోలో తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఎంపీకి మోడీ మంచి నీళ్లు అందించారు. వారిద్దరిలో నియంత ఎవరు? అసలు రాహుల్ గాంధీకి లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత ఉందా?’ అంటూ బీజేపీ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఇక అంతకంటే ముందు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ భగ్గుమన్నారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి మణిపూర్ అంశంపై చర్చ జరపాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఆ అంశంపై మోడీ స్పందించారు. మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 11 వేల ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారన్నారు. ఇప్పుడిప్పుడే మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని.. స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్నాయని వివరించారు. ఈ అంశంపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితువు పలికారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మణిపూర్‌లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న విద్వేష రాజకీయాలను ఏదో రోజు మణిపూర్ ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE