క‌మ‌ల‌ద‌ళం వ్యూహం.. ‘ఇండియా’లో క‌ల్లోలం..

BJP, Turmoil, India Alliance, BJPs Strategy Turmoil in India Alliance, NDA, Modi, Amit shah, BJP Elections, Latest Political Updates, Bihar CM, Indian Political Upates, PM Modi, Parliment Elections, Mango News Telugu, Mango News
bjp, india alliance, NDA, PM Modi, Amit shah

ఇండియా ( ది ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) ల‌క్ష్యం రానున్న ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని కూల్చివేయ‌డం. దానికోసం ఒక‌టి.. రెండు కాదు.. ఏకంగా  దేశంలోని 26 రాజకీయ పార్టీలు జ‌ట్టుక‌ట్టాయి. ప‌లుమార్లు స‌మావేశ‌మై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నాయి. తొలిసారిగా బిహార్ లోనే వీరి స‌మావేశం జ‌రిగింది. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన నేత కార‌ణంగానే కూట‌మి ల‌క్ష్యం నీరుగారిపోతోంది. ఆ పార్టీని కూల్చ‌డం త‌ర్వాత సంగ‌తి.. కూటమే కూలిపోయే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. 2023 జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన మొదటి ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఇందులో కొత్త కూటమికి సంబంధించిన ప్రతిపాదనను వివిధ రాజకీయ పార్టీల సభ్యులు తీసుకొచ్చారు. తొలి స‌మావేశానికే 16 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా చ‌ర్చించాయి.

అనంత‌రం కర్ణాటకలోని బెంగళూరులో జూలై 17, 18వ తేదీలలో మ‌రోసారి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన ఆయా పార్టీలు స‌మావేశం అయ్యాయి. పొత్తు ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు ఈ జాబితాలో మరో పది పార్టీలను కూట‌మిలో చేర్చుకున్నాయి. కూటమి పేరు ఖరారు చేసి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అని పేరు నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత 2023 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు ముంబై మూడోసారి స‌మావేశం అయ్యారు. సమావేశానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆతిథ్యం ఇవ్వగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రెండు రోజుల చర్చల్లో, కూటమి రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాన ఎన్నికల అంశాలపై చర్చించింది, సమన్వయ కమిటీని రూపొందించింది. విచిత్రం ఏంటంటే.. ఆ త‌ర్వాత నుంచే కూట‌మిలో స‌మ‌న్వ‌యం లోపించ‌డం ప్రారంభ‌మైంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా కూట‌మిలో స‌మ‌న్వ‌య‌లోపం క‌నిపించింది. ఎన్నిక‌ల అనంత‌రం రాహుల్ గాంధీ.. బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌ను, బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని క‌లిసి కూట‌మి ఐక్య‌త‌కు కృషి చేశారు. అయితే.. వారి మ‌ధ్య ఐక్య‌త ఏర్ప‌డ‌లేద‌ని తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పోటీ చేయ‌బోయే సీట్ల అంశం తెర‌పైకి వ‌చ్చేస‌రికి బేధాభిప్రాయాలు బ‌హిర్గ‌తం అవుతూ వ‌చ్చాయి. ఇంత‌లో నితీశ్ కూట‌మికి భారీ షాక్ ఇచ్చారు. గత పదేళ్లలో ఆరు సార్లు మిత్రులను మార్చేసిన బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను ఇక ఎన్‌డీఏలో చేర్చుకునేది లేదని కొద్ది నెలల కిందట బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. కానీ లోక్‌సభ ఎన్నికల ముంగిట ఆయన్ను సాదరంగా స్వాగతించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

బీజేపీపై ప్రతిపక్షాలన్నీ ఒకే అభ్యర్థిని నిలిపితే ఆ పార్టీ ఓటమి ఖాయమంటూ ‘ఇండియా’ కూటమికి బీజం వేసిన నితీశ్‌.. ఆ కూటమిని వదిలేసి తిరిగి ఎన్‌డీఏ గూటికి చేరడంతో కూట‌మిలో క‌ల్లోలం మొద‌లైంది. ఆయన్ను తిరిగి తమ వైపు లాక్కోవడం ద్వారా ప్రధాని మోదీ – షా ద్వ‌యం కూట‌మిపై ఎన్నిక‌ల‌కు ముందే పై చేయి సాధించింది. ఇదే సమయంలో మమత, కాంగ్రెస్‌ నడుమ చిచ్చు మొదలైంది. తమను సంప్రదించకుండా.. మాటమాత్రమైనా చెప్పకుండా రాహుల్‌గాంధీ స్వలాభం కోసం ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ను ప్రారంభించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమిని పణంగా పెట్టి కాంగ్రెస్‌ సొంతగా బలపడాలని చూస్తోందని లోలోపల రగిలిపోయారు. బెంగాల్లోని 42 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీకి రెండే ఇస్తానని ప్రతిపాదించారు. అటు మహారాష్ట్ర లో తాము గత ఎన్నికల్లో పోటీచేసిన 23 స్థానాల్లో ఒక్కటి కూడా వదులుకోబోమని ఉద్ధవ్‌ శివసేన ప్రకటించింది. దీంతో కూటమికి బీటలు పడినట్లయింది.

కొద్ది రోజుల కిందటి వ‌ర‌కూ నితీశ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. త‌మ ద‌గ్గ‌రికి రానిచ్చేది లేదే లేదంటూ.. అక‌స్మాత్తుగా బీజేపీ తీసుకున్న నిర్ణ‌యంతో కూట‌మి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ‘ఇండియా’లో క‌ల్లోలాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేసేందుకు కాంగ్రెస్ అధినాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. నితీశ్ త‌ర్వాత కీల‌కంగా ఉన్న నేత‌ల‌ను క‌లిసి కూట‌మి ల‌క్ష్యం నీరుగారిపోకుండా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఆ దిశ‌గా ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అవుతారో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE