లీలావతి ఆసుపత్రిలో చేతబడి కలకలం..

ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రి అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. కార్పొరేట్ వైద్యరంగంలో ప్రఖ్యాతి గాంచిన ఈ ఆసుపత్రిలో చేతబడి, బాణామతి జరిగింది అనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆసుపత్రి నిర్వహణలో భాగమైన లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ ప్రస్తుత ట్రస్టీ ప్రశాంత్ మెహతా, ట్రస్టీ కార్యాలయంలో అనుమానాస్పద రీతిలో జరిగిన చేతబడి కార్యకలాపాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాంద్రా కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర యాంటీ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు.

క్షుద్ర పూజల ఆనవాళ్లు.. పోలీసులు దర్యాప్తు
ప్రస్తుత ట్రస్టీ వర్గం ఆరోపించిన ప్రకారం, ట్రస్టీ కార్యాలయంలో పుర్రెలు, మంత్ర తంత్రాలకు సంబంధించిన పదార్థాలు, మూసిన కలశాలు లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లీలావతి ఆసుపత్రి దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలకు వైద్యం అందించే ప్రధాన కేంద్రం. కానీ, గత కొంతకాలంగా ట్రస్టీ సభ్యుల మధ్య ఆంతర్యుద్ధం ఆసుపత్రి పరిపాలనపై ప్రభావం చూపుతోంది.

ట్రస్టీ వివాదాలు.. నిధుల దుర్వినియోగ ఆరోపణలు
లీలావతి ట్రస్ట్ వ్యవస్థాపకుడు కిషోర్ మెహతా 2002లో స్వదేశం విడిచి వెళ్లిన తర్వాత, ఆయన తాత్కాలిక బాధ్యతలను సోదరుడు విజయ్ మెహతాకు అప్పగించారు. అయితే, విజయ్ మెహతా ఆసుపత్రి నిర్వహణలో తన కుటుంబసభ్యులను కీలక స్థానాల్లో నియమించుకుని, ట్రస్ట్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారని ఆరోపణలు వచ్చాయి. న్యాయపోరాటాల అనంతరం 2016లో కిషోర్ మెహతా మళ్లీ ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.

2024లో కిషోర్ మెహతా మరణంతో, ఆయన కుమారుడు ప్రశాంత్ మెహతా ట్రస్టీగా నియమితులయ్యారు. తాజాగా ఫోరెన్సిక్ ఆడిట్‌లో ట్రస్ట్ నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. విజయ్ మెహతా హయాంలో రూ.1500 కోట్ల ట్రస్ట్ నిధులు సద్వినియోగం కాలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుత ట్రస్టీ వర్గం ఈ ఆరోపణలను తీవ్రంగా తీసుకుని విచారణ కోరగా, పాత ట్రస్టీ వర్గం మాత్రం వీటిని పూర్తిగా ఖండించింది. చేతన మెహతా, విజయ్ మెహతా కుమారుడు, ఈ ఆరోపణలను కేవలం ట్రస్ట్‌పై ఆధిపత్యాన్ని సాధించడానికి పాతికొచ్చిన కుట్రగా అభివర్ణించారు. అయినప్పటికీ, పోలీసులు విచారణ కొనసాగిస్తూ 17 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లీలావతి ఆసుపత్రిలో ఈ వివాదం ముంబై నగరానికే కాకుండా, దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.