దేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉండటం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఊరికి ఒకరిద్దరు మాత్రమే క్యాన్సర్ బాధితులు ఉండేవారు. కానీ ఇప్పుడు వీధికే ఒకరిద్దరు క్యాన్సర బాధితులు ఉంటున్నారు. ఒకప్పుడు పొగ తాగడం, పొగాకు నమలడం వంటి చెడు అలవాట్ల వల్లే క్యాన్సర్ వస్తుందని భావించేవారు కానీ ఇప్పుడు చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
దీంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. క్యాన్సర్ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోంది. క్యాన్సర్ చికిత్స కేంద్రాలను కూడా పెంచుతోంది. రాబోయే రోజుల్లో ప్రతీ జిల్లా కేంద్రంలో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఇటీవల బడ్జెట్‌లో కూడా ప్రతిపాదించింది. ఇప్పటికే క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ పన్నును ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది.
మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల వల్ల.. పిల్లలు, పెద్దలు, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఏటా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఫ్యూచర్లో ఎవరూ కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ముఖ్యంగా ఐదు నుంచి ఆరు నెలల్లో 9 – 16 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్లు వేస్తామని కేంద్ర కుటుంబ, ఆరోగ్య, సంక్షేమ, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ తాజాగా తెలిపారు. వ్యాక్సిన్ పరిశోధనలు పూర్తి కావొచ్చాయని.. ట్రయల్స్ పూర్తి కాగానే అందరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు.
ఇప్పటికే 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జాదవ్ తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే భవిష్యత్‌లో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు తగ్గుతాయని ప్రతాప్‌రావు జాదవ్ తెలిపారు.