ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం స్థానం చాలా దారుణంగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు దీనిలో ర్యాంకులు కేటాయించగా.. భారతదేశం 176వ స్థానంలో ఉంది. 100కు గానూ 45.5 స్కోర్ మాత్రమే సాధించిన భారతదేశం అట్టడుగున నిలవడం ప్రకృతి ప్రేమికులను కలవరపెడుతోంది.
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ జాబితాలో భారతదేశం తర్వాత స్థానాల్లో కిరిబాటి 180 స్థానంలో, టర్కీ 179 వ స్థానంలో, ఇరాక్ 178 వ స్థానం, మైక్రోనేషియా 177 స్థానంలోనూ ఉన్నాయి. ల్యాండ్ మేనేజ్‌మెంట్, జీవ వైవిధ్యం, పాలన, సామర్థ్యం, భవిష్యత్తు పోకడలు ఎదుర్కొంటున్న ముప్పులు వంటి అంశాలను ఈ సూచికలో పరిగణనలోకి తీసుకుంటారు.
అంతేకాకుండా డెవలప్మెంట్, పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేయటంలోనూ ప్రతీ దేశం సాధించిన పురోగతిని దీనిలో అంచనా వేస్తారు. ఇజ్రాయెల్‌కు చెందిన బెన్-గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగెవ్, లాభాపేక్షలేని వెబ్‌సైట్ బయోడీబీలు ఈ ఇండెక్స్‌ను రూపొందించాయి. జీవ వైవిధ్యానికి పెరుగుతున్న ప్రమాదాలు, భూమి అసమర్థ నిర్వహణ వల్ల.. భారత్ అత్యల్ప ర్యాంకుకు కారణమని సూచీ తెలిపింది.
పట్టణ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల కోసం భూమార్పిడి 53 శాతానికి చేరడంతో.. స్థిరమైన భూ వినియోగ పద్దతులు అవసరమని పరిశోధకులు చెప్పారు. వ్యవసాయం, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధితో ఆవాసాలు కోల్పోవటం వంటి ఎన్నో అంశాలు దేశ జీవ వైవిధ్యానికి ప్రమాదాలు కలిగిస్తున్నాయని పరిశోధకులు అన్నారు.
భారత దేశంలో 2001 నుంచి 2019 మధ్య కొనసాగుతున్న అటవీ నిర్మూలన వల్ల 23,300 చదరపు కిలోమీటర్లలో చెట్ల స్థలం పోయిందని గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ పేర్కొంది. భారతదేశం భయంకరమైన జీవ వైవిధ్య సవాళ్లతో పాటు మంచి అవకాశాలు ఎదుర్కొంటుందని పరిశోధకులు చెప్పారు. 1970ల చివరి నుంచి రెట్టింపు అయిన జనాభా వల్ల దేశ జీవవైవిధ్య సంపద నిరంతరం ముప్పులో ఉందని వారు హెచ్చరిస్తున్నారు. స్థిరంగా ఉండే అభివృద్ధికి తోడ్పడే నిబంధనలను తయారు చేయటంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు నిధుల కేటాయింపు, సమర్థవంతమైన పరిరక్షణ చర్యలను ప్రోత్సహించటం వంటివి ప్రభుత్వాల అంకితభావంపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.