చూపించలేము… కానీ కోట్ల రూపాయలు తిప్పేస్తాయి! చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము, కానీ మార్కెట్‌లో అక్షరాలా వేల కోట్ల రూపాయలు గిరాకీ చేస్తున్నాయి. ఒక్క కాయిన్ దొరికితే లైఫ్ సెటిల్ అనే ఆశతో అనేక మంది మోసానికి గురయ్యారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ స్కామ్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అధిక లాభాలు హామీ ఇస్తూ ప్రజలను ఆకర్షించి, లక్షలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ మోసంపై CBI భారీ దాడులు నిర్వహించింది.
60 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
క్రిప్టో కరెన్సీ మోసాలపై CBI దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఢిల్లీ NCR, పూణే, చండీగఢ్, నాందేడ్, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో ఈ దాడులు కొనసాగాయి. నకిలీ వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ మోసాల ద్వారా కోట్లాది రూపాయల మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు క్రిప్టో ఎక్స్‌చేంజ్ వెబ్‌సైట్‌లను అనుకరించి అమాయకులను మోసం చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
2015లో ప్రారంభమైన భారీ స్కాం
ఈ భారీ స్కామ్ 2015లో మొదలైంది. దీని వెనుక ప్రధాన సూత్రధారి అమిత్ భరద్వాజ్ (ఇప్పటికే మరణించిన), అజయ్ భరద్వాజ్ మరియు వారి ఏజెంట్లు ఉన్నారు. వీరు GainBitcoin అనే పేరుతో అనేక నకిలీ వెబ్‌సైట్‌లు రూపొందించారు. పోంజీ స్కీమ్ మాదిరిగా ప్రజలను ఆకర్షించి, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. వేరియబుల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా వీరు ఈ మోసాన్ని నిర్వహించినట్లు CBI నిర్ధారించింది.
బిట్‌కాయిన్ పెట్టుబడిదారుల కోసం ప్రలోభాలు
ఈ స్కీమ్‌లో భాగంగా, 18 నెలల పాటు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే 10% రాబడి అందిస్తామని మోసగాళ్లు హామీ ఇచ్చారు. ఎక్స్ఛేంజీల ద్వారా బిట్‌కాయిన్ కొనుగోలు చేసి, క్లౌడ్ మైనింగ్ కాంట్రాక్టుల ద్వారా GainBitcoinలో పెట్టుబడి పెట్టమని ప్రజలను మోసం చేశారు.
CBI దర్యాప్తు.. మరిన్ని రహస్యాలు బయటకు రానున్నాయా?
ఈ స్కామ్ ద్వారా కోట్లాది రూపాయలు మాయమైనట్లు సమాచారం. CBI దర్యాప్తుతో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. క్రిప్టో మార్కెట్‌పై ఈ దాడుల ప్రభావం ఎలా ఉండబోతోందో వేచిచూడాలి!