ప్రేమికులు వాలెంటైన్ నెల అయిన ఫిబ్రవరి కోసం ఎదురుచూస్తుంటారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కాగా.. ఫిబ్రవరి 7 నుంచి ప్రేమికుల వారం ప్రారంభమవుతుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వాలెంటైన్స్ డే జరుపుకోకూడదు..ఆరోజు ఎవరికీ ప్రపోజ్ చేయకూడదు. ఒకవేళ అ లా చేస్తే, మీరు జైలుకు కూడా వెళ్లొచ్చట.
అరబ్ దేశాలలో అతిపెద్ద ఆర్డర్ సౌదీ అరేబియా.. ఇస్లామిక్ భావజాలాన్ని అనుసరించే దేశం. వాలెంటైన్స్ డేను చాలా దేశాల పండుగగా చేసుకోగా.. సౌదీ అరేబియాలో మాత్రం ఇస్లామిక్ భావజాలానికి విరుద్ధంగా భావిస్తారు. అందుకే అక్కడ ఎవరూ వాలెంటైన్స్ డే జరుపుకోరు.
అలాగే ఉజ్బెకిస్తాన్‌లో కూడా వ్యాలెంటెన్స్ డే ను జరుపుకోరు. 1991లో ఉజ్బెకిస్తాన్ సోవియట్ యూనియన్ అంటే USSR నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది. 2012 వరకు ఈ దేశంలో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడంపై ఎటువంటి పరిమితులు లేకపోయినా..ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ 2012 తర్వాత ఈ వేడుకలను నిషేధించింది. ఫిబ్రవరి 14 ఉజ్బెకిస్తాన్ వీరుడు, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ పుట్టినరోజు కావడంతో.. కేవలం బాబర్ పుట్టినరోజు వేడుకలనే జరుపుకోవాలని ప్రభుత్వం చెబుతుంది.
సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలతో పాటు మలేషియాలో కూడా వాలెంటైన్స్ డేను జరుపుకోరు. మలేషియా ప్రభుత్వం కూడా ప్రేమికుల దినోత్సవాన్ని అధికారికంగా నిషేధించింది. మలేషియా ఒక ఇస్లామిక్ దేశం కాడంతో.. 2005 సంవత్సరంలో ఒక ఫత్వా జారీ చేసింది. ఆ ఫత్వాలో వాలెంటైన్స్ డే యువతను నాశనం చేస్తోందని, నైతిక పతనం వైపు నెడుతోందని చెప్పబడింది. మలేషియాలో ఆ రోజు ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ఎవరికైనా ప్రపోజ్ చేస్తే వారిని అరెస్టు చేస్తుంది అక్కడి ప్రభుత్వం.
అంతేకాదు పాకిస్తాన్‌లో కూడా వాలెంటైన్స్ డే జరుపుకోరు. 2018లో పాకిస్తాన్ పౌరుడు ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో..వాలెంటైన్స్ డే పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చిందని తెలిపారు. ఇది ఇస్లాం బోధనలకు విరుద్ధం కావడంతో.. దీని ఆధారంగా ప్రేమికుల దినోత్సవ వేడుకలను హైకోర్టు నిషేధించింది. వీటితో పాటు 2010లో ఇరాన్ ప్రభుత్వం కూడా వాలెంటైన్స్ డే వేడుకలను అధికారికంగా నిషేధించింది. పాశ్చాత్య సంస్కృతి అని, అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఈ రోజు పెళ్లికాని జంట డ్యాన్స్ చేస్తూ కనిపించినా కూడా వారిని ఇరాన్‌లో జైలుకు పంపుతారు.