కరోనా మహమ్మారి కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను మే 7 వ తేదీ నుండి పలు దశలవారీగా భారత్ కు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా దేశాలను బట్టి వారి ప్రయాణం కోసం విమానాలు మరియు నావికాదళ నౌకలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయుల జాబితాను ఇండియన్ ఎంబసీఎస్ మరియు హై కమిషన్స్ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అయితే రవాణా చార్జీలను వారే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదుపాయం చెల్లింపు ప్రాతిపదికన అందుబాటులోకి వస్తుందని, నాన్-షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలు ద్వారా ప్రయాణానికి ఏర్పాట్లు చేయబడతాయని అన్నారు. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుగానే మెడికల్ స్క్రీనింగ్ చేసి ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్ఓపి) తయారు చేయబడిందని కేంద్రం తెలిపింది.
ప్రయాణ సమయంలో ప్రయాణీకులందరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య ప్రోటోకాల్స్ పాటించవలసి ఉంటుందని, గమ్యస్థానానికి చేరిన అనంతరం అందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలని చెప్పారు. విదేశాల నుంచి ప్రజలు వస్తున్న తరుణంలో వైద్య పరీక్షల ఏర్పాట్లు, క్వారంటైన్ సదుపాయాలు, ఇతర సంబంధిత అంశాలపై ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu