దేశంలో 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు నేటి నుంచి (మార్చి 16, బుధవారం) కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, మన పౌరులకు వ్యాక్సిన్ వేయడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజుని పేర్కొన్నారు. “నేటి నుంచి 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు/యువకులు వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు. ఇక 60 ఏళ్లు పైబడిన వారందరూ కూడా ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హులు. ఈ వయసుల వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాను” అని అన్నారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రధాని మోదీ పలు ట్వీట్స్ చేశారు.
“భారతదేశం యొక్క వ్యాక్సిన్ డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్దది, అలాగే ఇది సైన్స్ ఆధారితమైనది. పౌరులను కరోనా నుంచి రక్షించడానికి మరియు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి 2020 ప్రారంభంలోనే వ్యాక్సిన్‌లను రూపొందించే పనిని ప్రారంభించాము. మన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు ప్రైవేట్ రంగం ఈ సందర్భానికి అనుగుణంగా ఎదిగిన తీరు అభినందనీయం. 2020 చివరలో మూడు వ్యాక్సిన్ తయారీ సంస్థలను నేను సందర్శించాను మరియు పౌరులను రక్షించడానికి వారి చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా చూసాను. జనవరి 2021లో వైద్యులు, హెల్త్ కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం ముందుగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభించాము. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ముందంజలో ఉన్నవారికి వీలైనంత త్వరగా సరైన రక్షణ లభించేలా చూడడమే దీని లక్ష్యం. మార్చి 2021లో 60 ఏళ్లు పైబడినవారికి మరియు కొమొర్బిడిటీలు ఉన్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించబడింది. తర్వాత 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభించబడింది. వ్యాక్సిన్ కోరుకునే వారికి ఉచితంగా అందించడం ప్రతి భారతీయుడు గర్వించేలా చేసింది” అని ప్రధాని మోదీ అన్నారు.
“ఈ రోజుకే దేశంలో 180 కోట్ల డోసులను అందించాం. ఇందులో 15-17 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి 9 కోట్ల డోస్‌లు మరియు 2 కోట్లకు పైగా ప్రికాషన్ డోసులు కూడా ఉన్నాయి. ఇది కరోనాకు వ్యతిరేకంగా మన పౌరులకు ఒక ముఖ్యమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. గత సంవత్సరంగా దేశంలో జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైవ్ ప్రజల ఆధారితమైనది. ఇక్కడ ప్రజలు వారి డోసులను తీసుకోవడమే కాకుండా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇతరులను కోరారు. ఇది చూడడానికి హృద్యంగా ఉంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు మద్దతు ఇచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వాలను నేను అభినందిస్తున్నాను. అనేక రాష్ట్రాలు, ప్రత్యేకించి పర్యాటకం ముఖ్యమైన ఈశాన్య రాష్ట్రాలు పూర్తి వ్యాక్సినేషన్ కవరేజీకి దగ్గరగా ఉన్నాయి మరియు అనేక పెద్ద రాష్ట్రాలు కూడా బాగా పనిచేశాయి. మొత్తం ప్రపంచం పట్ల శ్రద్ధ వహించే భారతదేశపు తత్వానికి అనుగుణంగా, వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద అనేక దేశాలకు కూడా వ్యాక్సిన్‌లను పంపాము. దేశ వ్యాక్సినేషన్ ప్రయత్నాలు కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని మరింత పటిష్టం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు దేశంలో అనేక ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్‌లు ఉన్నాయి. అధ్యయనం యొక్క నిర్ణీత ప్రక్రియ తర్వాత పలు ఇతర వ్యాక్సిన్‌లకు కూడా అనుమతిని మంజూరు చేసాము. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కోవడానికి మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నాము. అదే సమయంలో ప్రజలంతా అన్ని కోవిడ్ సంబంధిత జాగ్రత్తలను పాటిస్తూనే ఉండాలి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ