దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర పరాజయం ఎదుర్కొంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ముఖ్యంగా పార్టీ అగ్ర నేతలందరూ ఓటమిని చవిచూశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (న్యూఢిల్లీ), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (జంగ్పురా), సీనియర్ నేత సత్యేంద్ర జైన్ (షాకూరీ బస్తీ) సహా కీలక నాయకులు అందరూ ఓడిపోయారు.
అయితే ఈ కఠిన రాజకీయ పరిస్థితుల్లోనూ, అగ్ర నేతల్లో ఒక్కరైన అతిశీ మాత్రమే విజయం సాధించారు. ఆమె చివరి రౌండ్లలో ఓటమి అంచుల్లో ఉండినా, చివరకు అనూహ్యంగా గెలుపొందారు. అయినప్పటికీ, తాను సెలబ్రేట్ చేసుకునే స్థితిలో లేనని స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడిన అతిశీ, తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని అంగీకరిస్తూనే, ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఆమె బీజేపీపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు.