మహాత్మా గాంధీని.. కేవలం ఒక స్వాతంత్ర్య సమర యోధుడిగానే కాదు జాతి పితగానూ అందరూ స్మరించుకుంటారు. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతావనికి స్వాతంత్య్రాన్ని అందించడంలో ఆయన పాత్ర కీలకం అన్ని విషయం చిన్నపిల్లలు కూడా పుస్తకాలలో చదువుకున్నారు.
మహాత్మా గాంధీ న్యాయవాది అయినా కూడా అన్ని అవకాశాలను, విలాసాలను వదులుకుని.. తన జీవితాన్ని మొత్తం దేశానికి సేవ చేయడానికే అంకితం చేశారు. అంతటి మహాత్ముని గూర్చి ఆగష్టు 15 సందర్భంగా మరోసారి తలచుకుని…ఆయన ఉద్యమస్పూర్తిని గుర్తు చేసుకుంటున్నారు.అయితే ఆయనకు ఓ గుడి ఉందని.. అందులో గాంధీకి నిత్యం పూజలు జరుగుతాయని చాలా మందికి తెలియదు.
దేశ స్వాతంత్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించినవారిలో మహాత్మా గాంధీ పాత్ర మరువలేనిది. అందుకే గాంధీ ఉద్యమస్ఫూర్తి భావితరాలకు తెలియజేయడానికి మహానేత విగ్రహాలను గ్రామగ్రామాన పెట్టి స్మరించుకోవాలని నల్గొండ జిల్లా వాసులు భావించారు. గాంధీకి విగ్రహం అనేది కామనే.. కానీ ప్రత్యేకత ఉండాలని భావించారు. అందులో భాగంగానే చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో నేషనల్ హైవే పక్కన మహాత్మా గాంధీకి గుడి నిర్మించి నిత్యం పూజలు జరుపుతున్నారు.
మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్లు.. కాపర్తిలో మహాత్మా గాంధీ ఆలయంలో గాంధీ విగ్రహంతో పాటు పంచభూతాల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన గ్రంథాలను, మట్టిని గుడిలో భద్రపరిచారు.
ఎక్కడోచోట మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టి..ప్రత్యేక దినాలలో మాత్రమే దండలు వేసి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ఈ రోజుల్లో.. కాపర్తి గ్రామంలో మాత్రం మహాత్మా గాంధీకి గుడి నిర్మించడమే కాకుండా నిత్యం పూజలు చేస్తున్నారు. ఇలా గాంధీని నిత్యం స్మరించుకోవడం తమకెంతో ఆనందాన్నిస్తుందని స్థానికులు చెబుతున్నారు. భావితరాలకు గాంధీ ఉద్యమస్ఫూర్తిని తెలిపే విధంగా తమ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని అంటున్నారు.