దీపావళి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతుంది. రామమందిర నిర్మాణం తర్వాత ఇదే తొలి దీపావళి కావడంతో లక్షలాది మంది ప్రజలు లక్ష దీపోత్సవాన్ని తిలకిస్తారని అంచనా వేస్తున్నారు. సరయు నది ఒడ్డున 28 లక్షల దీపాలు వెలిగించి కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రామమందిరాన్ని దీపకాంతులతో అలంకరించనున్నారు. లేజర్, సౌండ్ మరియు డ్రోన్ షో కూడా ఉంటుంది. నగరమంతా విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది.
6 దేశాల కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమం
మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆయా దేశాలకు చెందిన రామాయణాలను ప్రదర్శించనున్నారు. ఉత్తరాఖండ్ నుండి రామలీలా ప్రదర్శన కూడా ఉంటుంది. రామమందిర ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ఈసారి దీపోత్సవం అపూర్వంగా, అద్భుతంగా ఉంటుందని అన్నారు.
28 లక్షల దీపాలు: అక్టోబరు 30, గురువారం సరయు నది స్నాన ఘాట్‌లపై వెలుగుతున్న దీపాల సంఖ్య. ఆవు ఉత్పత్తులతో తయారు చేసిన 1.50 లక్షల పర్యావరణ అనుకూల దీపాలను వెలిగించేందుకు పశుసంవర్ధక శాఖ చేతులు కలిపింది.
ఈ కార్యక్రమం కోసం 30,000 వాలంటీర్ల కేటాయింపు. వాలంటీర్లకు ప్రత్యేక టీ-షర్టు, గుర్తింపు కార్డు, క్యూఆర్ కోడ్ క్యాప్‌ల పంపిణీ చేయనున్నారు. అయోధ్య ప్రజలు దీపోత్సవ వేడుకలను తిలకించేందుకు వీలుగా స్థానిక యంత్రాంగం 20 చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. 10,000 భద్రతా సిబ్బందితో 17 రూట్లలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
బుధవారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. సరయూ హారతి ఇస్తారు. అనంతరం నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ దీపాలను లెక్కించనున్నారు.