యూపీలోని ప్రయాగ్ రాజ్ జనవరి 13నుంచి ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోంది. భక్తుల హర హర మహాదేవ నామస్మరణలతో మారుమోగుతోంది. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసి అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.
మహా కుంభమేళా కార్యక్రమం ఇప్పటివరకు జరిగిన తీరు ఒక ఎత్తు .. జనవరి 29న జరిగిన మౌని అమావాస్య రోజు జరిగింది మరో ఎత్తు అన్నట్లుగా అక్కడ వాతావరణం కనిపించింది. ఈ మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళకు భారీగా భక్తులు హాజరయ్యారు. బుధవారం ఒక్క రోజే ఆరు కోట్ల మంది పుణ్య స్నానాలు చేయగా.. బుధవారం మధ్యాహ్నానికే 5.71 కోట్ల మంది స్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకూ 20 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు చెప్పారు.
కాగా జనవరి 29 బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకోవడంతో దాదాపు 30 మంది భక్తులు కన్నుమూశారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావడంతో పెను విపత్తు చోటు చేసుకోలేదు. మరోవైపు బుధవారం మౌని అమావాస్య కావడంతో భక్తులు స్నానం చేయడానికి పోటీపడ్డారు.ప్రయాగ్ రాజ్ ప్రాంతం అంతా ఇసుకేస్తే రాలనంతగా మారిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో గంగానది ప్రాంతం కోలాహలంగా మారింది. కోట్లాదిమంది భక్తులు ఎక్కడెక్కడ నుంచే వచ్చి పుణ్య స్నానాలు చేయడంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది.
ఇంత భారీ సంఖ్యలు భక్తులు వస్తున్నా కూడా.. ప్రభుత్వం ముందస్తుగా సౌకర్యాలు కల్పించడంతో ఎక్కడా కూడా కాలుష్యం అనేది ఏర్పడటం లేదని భక్తులు అంటున్నారు. పైగా ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన యూపీ సర్కార్ ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జపాన్ తరహాలో మియావాకి విధానంలో చిట్టడవులను పెంచడంతో. . గాలిలోకి భారీగా ఆక్సిజన్ పంప్ అవుతోంది. ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా.. భారీ స్థాయిలో పుణ్య స్నానాలు చేస్తున్నా కూడా కాలుష్యం ఏర్పడటం లేదు పైగా దుర్వాసన వెదజల్లడం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.