కోల్ కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు ఉదంతం జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డా.సందీప్ ఘోష్‌కు షాక్ తగిలింది. మరో అవినీతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు సందీప్ ఘోష్ ఇంటితోపాటు 15 చోట్ల సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆదేశాలతో ఆస్పత్రి కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ (సిట్) పోలీసులు.. కోర్టు ఆదేశం మేరకు కుంభకోణానికి సంబంధించిన పత్రాలను శనివారం సీబీఐకి అందజేశారు. ఈ అక్రమాలపై మధ్యంతర దర్యాప్తు నివేదికను సెప్టెంబర్ 17లోగా సమర్పించాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
RG కార్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీతో పాటు సందీప్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆసుపత్రిలో మందులతో సహా మృతదేహాలను విక్రయించడంలో సందీప్ హస్తం ఉందని.. ఘోష్ నేతృత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సహా ఐదుగురికి శనివారం పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సిఎఫ్ఎస్ఎల్) నిపుణులు కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారుల సమక్షంలో ఐదుగురు నిందితులకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. నిందితుడు సంజయ్‌రాయ్‌కు జైలులోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జైలులో సాంకేతిక సమస్యల కారణంగా లై డిటెక్టర్ పరీక్ష నేటికి వాయిదా పడింది.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఆరోగ్య సేవలకు విఘాతం ఏర్పడుతోంది. మా సోదరికి న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగుతాయని జూనియర్ డాక్టర్లు తేల్చిచెప్పుతున్నారు. నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. న్యాయమూర్తులు, వైద్యులు లాంటి వారు సమ్మె చేయరాదని పెర్కొంది. అంతేకాదు వైద్యులపై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కాగా కోల్‌కతాతో పాటు మహారాష్ట్రలోని బద్లాపూర్ సంఘటనలు ప్రజలు మరిచిపోకముందే ఢిల్లీలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలోని బాధితురాలిని పక్కింట్లో ఉండే వ్యక్తి అపహరించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు.