దేశంలోని పరిశుభ్రమైన, కఠినమైన ట్రాఫిక్ నియమాలున్న నగరాల్లో చండీగఢ్ ఒకటి. అయితే, ఇక్కడ జరిగిన ఒక ట్రాఫిక్ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 65 ఏళ్ల వృద్ధుడు 49 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో, కోర్టు అతనికి రూ. 24,500 జరిమానా విధించింది. అంతేకాక, అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేసింది.
49 సార్లు నిబంధనల ఉల్లంఘన
ఈ వృద్ధుడు 48 సార్లు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్‌ను దాటడం, ఒకసారి జీబ్రా క్రాసింగ్‌ను అతిక్రమించడం ద్వారా మొత్తం 49 సార్లు నిబంధనలు ఉల్లంఘించాడు. ఈ కేసు చండీగఢ్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM) సచిన్ యాదవ్ ముందుకు వెళ్లింది. విచారణలో కోర్టు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తొలుత జరిమానా మొత్తంగా రూ. 200 చెల్లించాలని, అలాగే సమాజ సేవ చేయాలని ఆదేశించింది.
శిక్ష సడలింపు – భారీ జరిమానా
అయితే, వృద్ధుడి వయస్సును దృష్టిలో ఉంచుకుని కోర్టు సామాజిక సేవ శిక్షను రద్దు చేసింది. కానీ, జరిమానా మొత్తాన్ని పెంచి, ఒక్కో చలాన్‌కు రూ. 500 విధించింది. దీంతో మొత్తం జరిమానా రూ. 24,500కు చేరింది.
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, కోర్టు వృద్ధుడి లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేసింది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ మార్గదర్శకాల ప్రకారం, వేగ పరిమితిని మించితే లేదా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెండ్ చేయాలని కోర్టు తెలిపింది. ఈ ఘటన ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలనే సందేశాన్ని స్పష్టంగా ఇస్తోంది.