విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విమానానికి బాంబు బెదిరింపులు ఎక్కువయిపోయాయి. దీంతో విమానం ప్రయాణం అంటేనే భయపెడుతున్నారు. ఒకప్పుడు ఏడాదికో.. ఆర్నెళ్లకో వినిపించే ఫేక్ కాల్స్ ఇప్పుడు రెగ్యులర్‌గా వణికిస్తున్నాయి.మరోవైపు వరుసగా విమానాలకు వస్తున్న బెదిరింపు కాల్స్‌తో విమానయాన అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబ్ ఉందని గుర్తు తెలియని వ్యక్తులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులను కిందకు దించి సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే అది ఫేక్ కాల్ అని తేలడంతో.. ఆ విమానం చండీగడ్ కు బయలుదేరి వెళ్లింది.
మొత్తంగా ఇలా వారం రోజుల వ్యవధిలో ఏకంగా 169 ఫేక్ కాల్స్ వచ్చాయి. ఈ ఫేక్ కాల్స్‌ను కేంద్ర పౌరవిమానయాన శాఖ కూడా సీరియస్‌గా తీసుకుంది. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. అయినా కూడా ఈ బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలకు ఎక్కువగా ఈ బెదిరింపులు వస్తున్నాయి. 80కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇప్పటి వరకూ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఈ బెదిరింపు కాల్స్ రోజురోజుకు పెరిగిపోతుండడంతో భారతీయ విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక్క గురువారం రోజే ఏకంగా 95 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే ఈ పరిస్థితి ఎంత కంట్రోల్ తప్పిందో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి.
బెదిరింపు కాల్స్, ఫేక్ మెయిల్స్ పెడుతున్నవారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి కాల్స్ చేసేవారికి జీవిత ఖైదు విధించేలా కొత్తగా చట్టసవరణ చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు నో ఫ్లయర్స్ జాబితాలో వారిని చేర్చుతామని పేర్కొంది. అలా హెచ్చరించి 12 గంటలు కూడా కాకముందే బెదిరింపు కాల్స్ రావడంతో అధికారులు ఉలిక్కిపడుతున్నారు. మరోవైపు ఇలా విమానాలకు వచ్చిన బెదిరింపులన్నీ ఫేక్ వేనని తేలినప్పటికీ ఆ వ్యక్తులు ఎవరనేది అధికారులు ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఇటు ఇలా వరుస బెదిరింపు కాల్స్ పౌర విమానయాన రంగానికి భారీ నష్టం తెచ్చిపెడుతుంటే.. ప్రయాణీకులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి.