మహాకుంభమేళాకు పోటెత్తుతున్న విదేశీ పర్యాటకులు..

Foreign Tourists Flocking To The Mahakumbh Mela

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో 144 ఏళ్ల తర్వాత ఘనంగా జరుగుతున్న మహా కుంభ మేళాకు.. ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు, భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, యూకే వంటి దేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అంతేకాదు భారతదేశంలోని మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం జరిగినా కూడా అవి మిలియన్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

భారత్‌లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తరలి వస్తున్న విదేశీ పర్యాటకుల్లో 21.4 శాతం పెరుగుదల కనిపిస్తుంది. ప్రముఖ వీసా ప్రాసెసింగ్‌ ప్లాట్‌ఫాం అట్లాస్‌ నివేదికల ప్రకారం.. దాదాపు 48 శాతం మంది తమ ఆధ్యాత్మిక ప్రయాణ వీసా అప్లికేషన్లను మహా కుంభమేళా వంటి పెద్ద ఈవెంట్‌లు, తీర్థయాత్రలకు లింక్ చేసినట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా.. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి కాబట్టి.. 42 మిలియన్ల మంది యాత్రికులు కుంభ్‌ మేళాకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం దేశీయ, అంతర్జాతీయ సందర్శకులకు, భక్తులకు కనెక్ట్‌ అవడంతో.. యూఎస్, యూకే వంటి దేశాల నుంచి కూడా ఆధ్యాత్మిక పర్యాటకుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది.

ఆధ్యాత్మిక పర్యాటకంలో కనిపించిన ఈ నయా ట్రెండ్.. గ్రూప్ ట్రావెల్ పట్ల ఎక్కువ ఆసక్తిని పెంచుతున్నట్లు తెలుస్తోంది. సమూహ ఆధ్యాత్మికమైన అనుభవాల కోసం ఇన్‌బౌండ్ జర్నీ కోసం ఏకంగా 35 శాతం అప్లికేషన్లు పెరిగాయట. గ్రూప్‌ టూరిజంలో భాగంగా పర్యాటకులు పవిత్ర ప్రదేశాలను సందర్శించినప్పుడు.. అక్కడి ఆచారాలను పాటించడానికి విదేశీయులు అసక్తి చూపిస్తున్నారు. దీనికి కుంభమేళా ఒక ఉదాహరణ అని నివేదిక చెబుతోంది. దీనికి తగినట్లే భారతీయులలాగే.. విదేశీయులు కూడా గంగానది పక్కన ధ్యానం చేయడానికి, సాయంత్రం హారతి చూడటానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి.