మోదీని కలవడం ఆనందంగా ఉందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లారు. అక్కడ సమావేశం తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఏఐ భారతదేశానికి తీసుకువచ్చే అద్భుతమైన అవకాశాలను గురించి వివరించారు. అనంతరం తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన పిచాయ్..మోదీని కలవడం ఆనందంగా ఉందని.. భారతదేశానికి ఏఐ అందించే అద్భుతమైన అవకాశాల గురించి, భారత్ డిజిటల్ పరివర్తనపై కలిసి పని చేసే మార్గాల గురించి తాము చర్చించామని ట్వీట్ చేశారు.
అంతకుముందు రోజు పారిస్‌లో జరిగిన ఇండియా–ఫ్రాన్స్ సీఈఓల ఫోరమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో, ఆవిష్కరణలను పెంపొందించడంలో ఈ ఫోరమ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. భారతదేశం, ఫ్రాన్స్‌లకు చెందిన వ్యాపారవేత్తలు కీలక రంగాలలో కొత్త అవకాశాలను సృష్టించడానికి కలిసి వస్తున్నారని కూడా చెప్పిన మోదీ.. ఇది భవిష్యత్ తరాలకు వృద్ధి, పెట్టుబడులను నడిపిస్తుందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.
భారత్,ఫ్రాన్స్ కేవలం ప్రజాస్వామ్య విలువలతో అనుసంధానించబడలేదని చెప్పిన ప్రధాని మోదీ.. లోతైన నమ్మకం, ఆవిష్కరణతో పాటు ప్రజలకు సేవ చేయడం మా స్నేహానికి మూలస్తంభాలని చెప్పుకొచ్చారు. తమ సంబంధం కేవలం తమ రెండు దేశాలకే పరిమితం కాదని.. భారత్ ,ఫ్రాన్స్ కలిసి ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.
మరోవైపు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించారు. వారం రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ నాయకులు, విధాన నిర్ణేతలు,పరిశ్రమ నిపుణులు హాజరైన ఉన్నత స్థాయి విభాగంతో ముగిసింది. సాంకేతికత మరియు ఆవిష్కరణలలో భారత్ , ఫ్రాన్స్ దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ఇది హైలైట్ చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.