మోదీ సర్కార్ వృద్దులకు అండగా నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దేశంలోని 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా ఆరోగ్య సౌకర్యాలను అందించేందుకు సిద్దమైంది.. ఈ క్రమంలో వారికి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వీరిని తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడు 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరూ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ పథకం కింద కవర్ చేయబడనున్నారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత ఆరోగ్య కవరేజీని ఎన్డీఏ కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం కింద కింద సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తుంది. ఒక కుటుంబం ఇప్పటికే ఆయుష్మాన్ కింద కవర్ చేయబడి.. వారి కుటుంబంలో ఒక సభ్యుడు 70 ఏళ్లు పైబడి ఉన్నట్లయితే రూ.5 లక్షల అదనపు కవరేజీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మోదీ సర్కార్ వరుసగా మూడోసారి ఎన్నికైన తర్వాత వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం వంటి కీలక అంశాలపై ప్రస్తుతం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే వృద్ధులకు ఉచితంగా చికిత్స పొందేందుకు పెద్ద అవకాశాన్ని తీసుకొస్తోంది. ఈ నిర్ణయంతో దేశంలో దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు 5 లక్షల రూపాయల విలువైన ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ కవరేజీ లక్ష్యం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ప్రత్యేక కార్డును అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.