ఇండియా కూటమిలో ఎవరికి వారు యమునా తీరులాగా పరిస్థితి తయారయ్యింది. కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్న మిత్రపక్షాల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు ఇండియా కూటమిలోని విభేదాలను మరోసారి బయటపెట్టాయి. అదానీ అంశంపై పార్లమెంటు లోపలేకాదు, బయటకూడా రచ్చ ఆగడం లేదు. అయితే ఇండియా కూటమిలో రెండు పార్టీలు మాత్రం ఈ ఆందోళనకు దూరం అయ్యాయి. ఇండియా కూటమి ఆందోళనకు తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీలు దూరంగా ఉన్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి వరుస పరాజయాలు ఎదురవుతున్న నేపథ్యంలో….కూటమి సారధ్య బాధ్యతలు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అప్పగించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా మమతా బెనర్జీ కూడా ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలను వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో కూటమిలోని రాజకీయ పార్టీలు …..మమతా బెనర్జీ వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రముఖ నేతలు లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ మమతకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం వహించడంపై పార్టీల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది టీఎంసీ వల్లే సాధ్యం అని మమతా బెనర్జీకి మద్దతు పలికే పార్టీలు, నేతలు చెబుతున్నారు. అందుకే ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ పేరును ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే మమతా బెనర్జీకి ఇండియా కూటమి చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఇండియా కూటమిలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించేందుకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్ననట్లు సమాజ్‌వాదీ పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి టీఎంసీ గట్టి పోటీని ఇస్తోందని.. కమలం పార్టీని నిలువరించడంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పని చేస్తోందంటున్నారు.
ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేననే ఆరోపణలు వస్తున్నాయి.