గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు.. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీ చెట్లు విరిగి పడటంతో.. రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. భారీ వర్షాలతో వరదలు పోటెత్తడంతో ఇప్పటి వరకూ 28 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు. పశ్చిమ ప్రాంతాలపై భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని అధికారులు చెప్పారు.
వడోదరలో 10 నుంచి 12 అడుగుల వరకూ నీరు నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. భారీ వర్షాల ప్రభావం వల్ల వరదలో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు అందించడానికి సైన్యం కూడా సహకారం అందించాలని స్థానిక అధికారులు కోరుతున్నారు. అయితే.. వరదల ప్రభావం ఇప్పటికే 40వేల మందిపైన పడిందనీ.. వారందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఇప్పటికే ఆజ్వా ఆనకట్ట ప్రమాదకర స్థాయికి చేరుకుంది.ఆనకట్ట నీటి నిల్వ 25 అడుగుల గరిష్టానికి చేరుకోవడంతో.. అధికారులుప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు .ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వడోదరలో సహాయక చర్యల్లో భాగంగా 1200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు అధికారులు చెప్పారు. గుజరాత్‌లో వర్షాలు ఈ రోజు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కూడా నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనివల్ల ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
గుజరాత్‌లో భారీ వర్షాలు, వరదలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. దీనిపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి అన్ని వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. వడోదరలో సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి NDRF బృందాలు, ఆర్మీ కావాలని గుజరాత్ ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరింది.