మనాలిలో భారీగా కురుస్తోన్న మంచుతో.. మనాలి-సోలంగనాల రోడ్డుపై ఈ ఉదయం 6 కి.మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సొలంగనాలలో వెయ్యికి పైగానే వాహనాలు ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. దీంతో ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులు తీవ్రమైన చలి, మంచులో ఇబ్బందులు ఎదుర్కొంటూనే.. ట్రాఫిక్ జామ్ లో ఇరుకున్న వాహనాలను క్లియర్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. మనాలిలో అయితే భారీగా మంచు కురుస్తుండటంతో..ఉష్ణోగ్రత మైనస్‌లో ఉంది. మరోవైపు హిమపాతాన్ని ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. మంచు వల్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పర్యాటక నగరం మనాలికి ఆనుకుని ఉన్న పల్చన్, సొలంగనాల, అటల్ టన్నెల్‌లో నిన్న సాయంత్రం నుంచి భారీగా మంచు కురుస్తోంది. దీంతో సొలంగనాల వైపు వెళ్లిన పర్యాటకుల వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
పర్యాటకులను కూడా పోలీసులు సురక్షితంగా తరలించారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భారీ మంచు వల్ల.. సొలంగనాల నుంచి మనాలి మధ్య 1000 కంటే ఎక్కువ పర్యాటక వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై దాదాపు 6 కి.మీటర్ల వరకూ జామ్ ఏర్పడింది. వాహనాలు నిలిచిపోవడంతో పాటు రోడ్డు దిగ్బంధం కావడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.
దీనికి తోడు మైనస్ టెంపరేచర్‌తో పోలీసులు, ప్రయాణికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమపాతం కారణంగా పర్యాటకులు కొద్ది రోజులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పర్యాటకులను జిల్లా యంత్రాంగం సోలంగనాల వరకు మాత్రమే పంపింది. సాయంత్రం నుంచి మంచు ఎక్కువగా కురుస్తుండటంతో పర్యాటకులు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.