జమ్మూ కాశ్మీర్ కు సరైన సమయంలో మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తాం : అమిత్ షా

Home Minister Amit Shah Says Jammu Kashmir will get Statehood at an Appropriate Time

లోక్‌సభలో శనివారం నాడు‌ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు ఆమోదం పొందింది. ముందుగా సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రసంగం చేశారు. ఈ సవరణ బిల్లుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు సరైన సమయంలో తిరిగి మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించారు. గతంలో కూడా ఇదే విషయాన్ని సభలో వెల్లడించామని చెప్పారు. రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఈ బిల్లులో ఎక్కడా లేదని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

ఆర్టికల్ 370 ను రద్దు చేసేటప్పుడు ఇచ్చిన వాగ్దానాలపై ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నిస్తున్నారని, అయితే గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏం చేసిందని అమిత్ షా ప్రశ్నించారు. మీరు గతంలో సరిగ్గా పని చేసి ఉంటే, మమ్మల్ని అడగవలసిన అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీలపై మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అంశాలను రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్షాలను కోరారు. ముందుగా ఆగస్టు 5, 2019 న ఆర్టికల్ 370 రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించగా అక్టోబర్ 31, 2019 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును లోక్‌సభలో ఆమోదించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ