దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేలిపోనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత.. ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే అసలు ఓట్లను ఎలా లెక్కిస్తారు? లెక్కించే సమయంలో అధికారులు ఎటువంటి నియమనిబంధనలు పాటిస్తారో ఇప్పుడు చూద్దాం..
ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి ఒకే ప్రదేశాన్ని కేటాయిస్తారు. సాధారణంగా ప్రభుత్వ బడులు, కాలేజీలు లేదా సంబంధిత నియోజకవర్గానికి సంబంధించిన ఆర్‌వో ప్రధాన కార్యాలయాన్ని కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేస్తారు. మొదట ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 54A ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమయిన అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోతే ఉదయం 8 గంటలకే ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
కౌంటింగ్ ప్రారంభించడానికి ఫారం-17సీతో పాటు, ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లు ఉంటే సరిపోతుంది. సీయూలోని రిజల్ట్‌ను కౌంటింగ్ సూపర్ వైజర్, అభ్యర్థుల తరుపున కౌంటింగ్ ఏజెంట్లు, మైక్రో అభ్జర్వర్లకు ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటారు. ఓట్లను లెక్కించే సమయంలో.. పోలైన ఓట్లు పారం-17సీలో నమోదు చేసిన సంఖ్యతో సమానంగా ఉన్నాయా? లేదా? అన్నది ఎప్పటికప్పుడు అధికారులు చెక్ చేసుకుంటూ ఉంటారు. సీయూలోని డిస్‌ప్లే పనిచేయకపోతే.. మిగిలిన సీయూలు అన్నింటిని లెక్కించిన తర్వాత దానికి సంబంధించిన వీవీ ప్యాట్‌లోని స్లిప్పులను లెక్కిస్తారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు చెందిన ఫారం 17సీని తుది ఫలితాన్ని అధికారికి పంపిస్తారు. దానిని అధికారి ఫారం-20లో ఎంటర్ చేస్తారు.
ఇకపోతే ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయిదు పోలింగ్ స్టేషన్లను అధికారులు ఎంపిక చేస్తారు. ఆయా పోలింగ్ బూత్‌లో పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్పులను సరి చూస్తారు. రిజెక్టు అయిన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య కంటే మెజార్టీ తక్కువగా ఉంటే.. రిజెక్టు అయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తప్పనిసరిగా పున:పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY