వృద్ధాప్యంలో భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పింఛను పథకాలను అందజేస్తోంది. వాటిలో కొన్ని అద్భుతమైన రాబడిని అందించే పథకం.. అటల్ పెన్షన్ యోజన. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పింఛన్ పథకం చాలా సురక్షితమైనది. అటల్ పెన్షన్ యోజన పథకం అనేది ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించడానికి ఉపయోగపడుతుంది.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పెన్షన్ పథకంలో.. అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 7 కోట్లు దాటినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే అటల్ పెన్షన్ యోజనకు 56 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పెన్షన్ పథకం ఇప్పుడు 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2015లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన అటల్ పెన్షన్ యోజనలో స్థూల ఎన్‌రోల్‌మెంట్ డేటా ప్రకారం.. ఈ పింఛన్ పథకంలో నమోదు చేసుకున్న వారి సంఖ్య 7 కోట్లు దాటినట్లు ఉంది. వీటిలో 56 లక్షల నమోదులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరగడం విశేషం. సమాజంలోని అణగారిన వర్గాలకు పెన్షన్ కవరేజీని అందించడానికి అటల్ పెన్షన్ యోజన ద్వారా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ.. అన్ని రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో పెన్షన్ విషయాలకు సంబంధించిన రెగ్యులేటర్, అటల్ పెన్షన్ యోజన గురించి అవగాహన కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసింది.
అటల్ పెన్షన్ యోజన పథకం చందాదారులకు.. పూర్తి భద్రతా కవర్ అంటే సంపూర్ణ సురక్ష కవచ్ కింద పింఛన్‌ను అందించడంతో పాటు.. మరణించిన తర్వాత జీవిత చందాదారుని భాగస్వామికి అదే పెన్షన్‌ను అందించే విధంగా రూపొందించబడింది. ఇది మాత్రమే కాదు, అటల్ పెన్షన్ యోజన చందాదారుడు, జీవిత భాగస్వామి మరణించిన తర్వాత 60 ఏళ్ల వయస్సు వరకు కూడబెట్టిన మొత్తాన్ని కుటుంబానికి తిరిగి వస్తుంది.
అటల్ పెన్షన్ యోజన 9 మే 2015న ప్రారంభించబడింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారంతా ఈ అటల్ పెన్షన్ యోజనలో చేరొచ్చు. ఈ పథకంలో 60 ఏళ్ల వయస్సు తర్వాత రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పింఛన్ పొందొచ్చు. భార్యాభర్తలిద్దరినీ కలిపితే ఈ పథకం కింద రూ.10,000 పెన్షన్ ను పొందొచ్చు. పథకం చందాదారుడు కనుక మరణిస్తే, జీవిత భాగస్వామికి జీవితాంతం ఈ పెన్షన్ అందుతుంది. ఇద్దరూ చనిపోతే మాత్రం మొత్తం పింఛను మొత్తం నామినీకి అందిస్తారు. అటల్ పెన్షన్ యోజనలో చేరిన చందాదారులు 2035 నుంచి పెన్షన్‌ను అందుకుంటారు.