రేపు కౌంటింగ్ జరుగుతుంది అనగా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు వెల్లడించింది. 45 రోజులుగా.. ఏడు విడతలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియలో భారత దేశం సంచలనం సృష్టించిందని పేర్కొంది. అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి భారత దేశ ఓటర్లు ప్రపంచంలోనే రికార్డు సృష్టించారని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపారని వెల్లడించారు. ఓటర్లకు సలాం చెబుతూ సీఈసీ ప్యానెల్ సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రేపు కౌంటింగ్ జరగనుండగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. సీఈసీ కీలక విషయాలను వెల్లడించింది. రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. మనదేశంలో ఓటు వేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉందని ఆనందం వెలిబుచ్చారు. ఏడు దశల్లో పోలింగ్ విజయవంతంగా ముగిసిందని, 27 రాష్ట్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరమే రాలేదని వివరించారు.
దేశవ్యాప్తంగా 2024 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, వారిలో 31 కోట్ల మందికిపైగా మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు, మహిళా ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. జమ్మూ కశ్మీర్‌లో నాలుగు దశాబ్దాల్లో జరగనంత పోలింగ్ జరిగిందని తెలిపారు. పెద్దగా హింసాత్మక ఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదని సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక ఎన్నికలుగా ఇవి మిగిలిపోతాయని తెలిపారు. దేశ్యాప్తంగా రేపే కౌంటింగ్ జరుగుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈమేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో పక్షపాత వైఖరి అవలంబించారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను సీఈసీ ఖండించింది. సీఈసీపై విపక్షాలు సంధించిన అన్ని ప్రశ్నలకూ సక్రమంగా ఎన్నికలు పూర్తి చేయడం ద్వారా జవాబు చెప్పామని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు.
కాగా.. అంతకు ముందు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల కోసం 56 లక్షల ఈవీఎంలను వినియోగించినట్టు తెలిపారు. తద్వారా వేలాది టన్నుల కాగితం ఆదా అయిందని.. ఇది పర్యావరణానికి అత్యంత మేలు చేసే విషయమని పేర్కొన్నారు. పైగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మునుపెన్నడూ ఇలా జరగలేదని తెలిపారు. దీనిని ప్రతి పౌరుడు గర్వంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ అనే విధానం పర్యావరణ అనుకూలతకు ప్రధాన నినాదమని.. దీనిని ఎన్నికల సంఘం పాటించిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత హాటెస్ట్ ఎన్నికలని, ఎండ వేడిని కూడా తట్టుకుని ఓటర్లు ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేశారని.. దీనికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY