డీజీసీఏ నివేదిక ఆధారంగా ఇండిగో పై కఠిన చర్యలు – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

IndiGo Being Held Accountable, Civil Aviation Minister Ram Mohan Naidu in Lok Sabha

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు. రామ్మోహన్ నాయుడు, ఇండిగో విమానయాన సంస్థలో ఉద్భవించిన సంక్షోభంపై మంగళవారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభానికి పూర్తిగా ఇండిగో సంస్థ నిర్వహణపరమైన లోపాలే కారణమని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్రం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు.

విమానాల రద్దు, ఆలస్యం, సేవల అంతరాయం వంటి సమస్యలను సీరియస్‌గా తీసుకున్నామని, ఇప్పటికే విమానయాన నియంత్రణ సంస్థ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ – DGCA) కంపెనీకి నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని చెప్పారు. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి రామ్మోహన్ భరోసా ఇచ్చారు.

మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు
  • జవాబుదారీ: ప్రస్తుత సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆ సంస్థ ప్రణాళికా వైఫల్యాలు, నిబంధనలను పాటించకపోవడం వల్లే ప్రయాణీకులకు ఇంత ఇబ్బంది కలిగిందని తెలిపారు.

  • షోకాజ్ నోటీసులు: ఇండిగో సంస్థకు ఇప్పటికే డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా సంస్థపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.

  • భద్రత హామీ: ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని, భద్రత పూర్తిగా అమలులో ఉందని ఆయన సభకు హామీ ఇచ్చారు.

  • దీర్ఘకాలిక చర్యలు: భారతదేశ విమానయాన రంగాన్ని ప్రయాణీకుల కేంద్రీకృతంగా మార్చడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్యలు
  • సాధారణ పరిస్థితులు: దేశవ్యాప్తంగా అన్ని ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయని, అన్ని విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, రద్దీ ఇబ్బందులు లేవని మంత్రి తెలిపారు.

  • సహాయం: రద్దయిన సర్వీసులకు సంబంధించి రీఫండ్, బ్యాగేజ్ ప్రయాణీకులకు అందజేయడం వంటి సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

విమాన సర్వీసుల రద్దు కొనసాగింపు

మంత్రి లోక్‌సభలో ప్రకటన చేసినప్పటికీ, ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. మంగళవారం కూడా దేశవ్యాప్తంగా 92 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, గోవా వంటి ప్రధాన నగరాలకు సంబంధించిన సర్వీసులు రద్దు కావడంతో, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రయాణీకులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెస్తూ, ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించడానికి దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయడానికి విమానయాన శాఖ సిద్ధంగా ఉంది. డీజీసీఏ నివేదిక వచ్చిన తర్వాత, ఇండిగోకు తప్పకుండా జరిమానా విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఇదిలాఉంటే, మరోవైపు కేంద్రం ఇండిగోపై అప్పుడే చర్యలకు దిగింది. శీతాకాలానికి సంబంధించి ఆ సంస్థ షెడ్యూల్లో 5% కోత విధించింది. దీంతో రోజుకు 2,200 విమాన సర్వీసులను నడుపుతున్న ఇండిగో, 100 విమాన సర్వీసులను తగ్గించాల్సి ఉంటుంది. ఈ మేరకు డీజీసీఏ కీలక ప్రకటన చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here