భారత్ సురక్షిత దేశమా? ప్రమాదకర దేశమా?

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ దేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాలు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే.. కొన్ని దేశాలు పేదరికంతో అల్లాడిపోతున్నాయి. అలాగే కొన్ని దేశాలు ప్రశాంతంగా ఉంటే..కొన్ని నిత్యం హింస, యుద్ధం అంటూ రగిలిపోతున్నాయి. కొన్ని దేశాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటే.. మరికొన్ని దేశాలు ఎలాంటి పర్యాటకులు పరిచయం లేని ప్రదేశాలుగానే మిగిలిపోతున్నాయి.

కాగా ప్రపంచంలో అత్యంత సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాల జాబితా రీసెంటుగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యాపీనెస్‌ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని వెల్‌బీయింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ తాజాగా వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌ – 2025ను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఫిన్‌లాండ్‌ వరుసగా ఎనిమిదోసారి కూడా సురక్షితమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో, క్రౌడ్‌సోరŠస్డ్‌ డేటా ప్లాట్‌ఫామ్‌ నంబియో కూడా నేరాల రేటు ఆధారంగా సురక్షిత, ప్రమాదకర దేశాల జాబితాను ప్రకటించింది.

నంబియో సర్వే ప్రకారం సురక్షిత దేశాల జాబితాలో స్పెయిన్, ఫ్రాన్స్‌ మధ్య ఉన్న చిన్న దేశం అయిన అండోరా.. 84.7 సేఫ్టీ స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా నిలిచింది. కేవలం 181 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగి ఉండి.. 82వేల 638 జనాభాతో ఈ దేశం ప్రయాణికులకు, పర్యాటకులకు అత్యంత సురక్షితమైన దేశంగా గుర్తింపు పొందింది. రెండో స్థానంలో 84.5 స్కోరుతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ , మూడో స్థానంలో 84.2 స్కోరుతో ఖతార్‌ , తర్వాత 82.9 స్కోరుతో తైవాన్‌ , 81.7 స్కోరుతో ఒమన్‌ ఉన్నాయి. ఈ దేశాలు తక్కువ నేరాల రేటుతో పాటు ఉన్నత భద్రతా ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి.

అయితే ఈ జాబితాలో భారతదేశం 55.7 స్కోరుతో 66వ స్థానంలో నిలిచింది. 50.8 స్కోరుతో అమెరికా 89వ స్థానంలో ఉండగా, 51.7 స్కోరుతో యూకే 87వ స్థానంలో ఉన్నాయి. మరోవైపు వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌లో మాత్రం భారత్‌ 147 దేశాల్లో 4.389 స్కోరుతో 118వ స్థానంలో ఉంది. ఈ స్కోరు గతేడాది 126వ స్థానంతో పోలిస్తే మెరుగుదలే అయినా కూడా.. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌ కు 109 స్కోర్, నేపాల్‌ 92 స్కోర్ కంటే వెనుకబడే ఉండటం గమనార్హం.

ఇక ప్రమాదకర దేశాల విషయానికొస్తే, వెనిజులా 19.3 స్కోరుతో అత్యంత ప్రమాదకర దేశంగా నిలిచింది. దీని తర్వాత పాపువా న్యూ గినియాకు19.7 స్కోర్, హైతీ కి 21.1స్కోర్, ఆఫ్ఘనిస్తాన్‌ కు 24.9 స్కోర్, దక్షిణాఫ్రికాకు 25.3 స్కోరుగా ఉన్నాయి. ఈ దేశాల్లో నేరాల రేటు, అస్థిరత ఎక్కువగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. నంబియో ఈ రిపోర్టును రూపొందించడానికి పగలు, రాత్రి భద్రత, దొంగతనాలు, వేధింపులు, జాతి,మత వివక్ష వంటి అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంది. సురక్షిత దేశాల్లో అండోరా అగ్రస్థానంలో ఉండగా.. హ్యాపీనెస్‌ రిపోర్ట్‌లో ఫిన్‌లాండ్‌ టాప్‌లో ఉంది.